Monday, April 11, 2011

వస్తాడు నా రాజు రివ్యూ [vastadu na raju review]


'డీ' సినిమా సూపర్ హిట్ తరవాత సరైన హిట్ రాకపోవడం పక్కనుంచి సలీం వంటి సినిమాతో విసుగేత్తిపోయిన విష్ణు కసితో తనను తాను నిరుపించుకోవటానికి 'వస్తాడు నా రాజు' సినిమాను నిర్మించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పద్మశ్రీ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై విష్ణు తోలిసారి నిర్మిస్తున్న ఈ చిత్రంతో హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాప్సీ విష్ణుతో జోడి కట్టిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ కెమెరామెన్ యస్.గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా గౌతమ్ రాజు ఎడిటింగ్ నిర్వహించారు. తొలిసారి మణిశర్మ విష్ణు సినిమాకు సంగీతాన్ని సమకూర్చగా వెన్నెలకంటి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, విశ్వ సాహిత్యాన్ని అందించారు. షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏవిధమైన ప్రచారం లేకపోయినా, లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించి ఆఫై విజయవాడలో ఆడియో రిలీజ్ ఘనంగా నిర్వహించి బాలీవుడ్ తరహాలో కావలిసినంత ప్రచారాన్ని కూడబెట్టుకున్నాడు విష్ణు. సలీమ్ సినిమా చేదు అనుభావలనుండి నేర్చుకున్న గుణపాఠాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను 2.30 గంటలు నవ్విస్తుంది అని భరోసా ఇచ్చిన విష్ణు నమ్మకాన్ని 'వస్తాడు నా రాజు' ఎంతవరుకు నిలబెట్టిందో ఈ సమీక్షలో చూద్దాం.
కధ: హోం మినిస్టర్(షాయాజీ షిండే) దగ్గర నమ్మిన బంటులా పనిచేస్తున్న నరసింహ(ప్రకాష్ రాజ్) కు ఎమ్.యల్.ఎ కావాలని ఆశ. దానికి మొదట్లో హోం మినిస్టర్ ఒప్పుకోకపోయినా ఆయన కొడుకు అజయ్(అజయ్) నరసింహచెల్లెలు పూజ(తాప్సీ) ను పెళ్ళిచేసుకుంటా లేదంటే చస్తా అనటంతో మెత్తపడ్డ హోం మినిస్టర్ నరసింహను ఎమ్.యల్.ఎ చేయటానికి ఒప్పుకుంటాడు. పూజ తన కలలరాజు కోసం కలలు కంటూ ఉంటుంది. అలాగే ప్రేమంటే మంచి ఒపీనియన్ లేని వెంకటప్పనాయుడు అలియాస్ వెంకి కిక్ బాక్సర్ కావాలి అనే ధ్యేయంతో ఉంటాడు. హోం మినిస్టర్ కొడుక్కు తన చెల్లెలను ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్న నరసింహకు కొన్ని అనుకోని పరిస్థితుల్లో వెంకీ, పూజల మద్య ప్రేమ ఉంది అని అనుమానం కలుగుతుంది. కానీ వారి మద్య ఎటువంటి సంబందము ఉండదు. అపోహలు నిజమని నమ్మిన నరసింహ వెంకి జీవితంలో కష్టాలు కలిగిస్తాడు చివరికి అతన్ని చంపటానికి ప్రయత్నిస్తాడు. ఎదురు తిరిగిన వెంకి పూజను కిడ్నాప్ చేసి తన కష్టాలన్నీ తీరుస్తేనే పూజను వదిలిపెడతా అంటాడు. ఆతరవాత దగ్గరగా ఉన్న వెంకి, పూజల మద్య ప్రేమ పుడుతుంది. వెంకి ప్రోబ్లమ్స్ తీర్చేసిన నరసింహకు వారిద్దరిమద్య ప్రేమ లేదని తెలుస్తుంది. దాంతో హోం మినిస్టర్ కొడుకుతో పెళ్ళికి సిద్డంచేస్తాడు. ఆ తరవాత వెంకి, పూజల ప్రేమ కధ ఎలా సుఖంతమవుతుందో అందరు ఊహించవచ్చు.

విశ్లేషణ: తెలుగు సినిమాకు మూస దర్శకుల బెడద ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు. పేరుకు కొత్త దర్శకులేకాని పరమ రొటీన్ కధ కధనాలతో ప్రేక్షకులను విసుగేత్తిస్తున్నారు. వీళ్ళు సృజనాత్మకతతో కాకుండా ఫార్ములాలతో లెక్కలేసుకుని సినిమాలు చేస్తున్న వ్యాపారవేత్తలుల ఉన్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకుడిగా నూటికి నూరుశాతం ఫెయిల్ అయ్యాడు. ఏ విభాగం మీద అతనికి పట్టు ఉన్నట్టు అనిపించదు. రొటీన్ కధ కు మూస కధనాన్ని జోడించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. మరుధూరి రాజ గారి మాటల్లో కూడా పదును లేదు, చాలా సన్నివేశాలు సరైన గ్రిప్పింగ్ డైలాగులు లేక తేలిపోయాయి. మణిశర్మ పాటలు ఏ మాత్రం ప్రేక్షకులను దియేటర్లో కుర్చోపెట్టలేవు. ఆయన బ్యాక్ స్కోరు కూడా ఆకట్టుకునేట్టులేదు లేదు. సినిమా సాంకేతిక పరంగా పర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా అంత డిజిటల్ లో రూపొందించటం విశేషం. రెడ్ కెమెరాను ఉపయోగించి చేసిన చిత్రీకరణ బాగుంది. గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఫైటులు కానీ, పాటలుకానీ పెద్దగా ఆకట్టుకునేట్టు లేవు. హీరోగా కంటే నిర్మాతగానే విష్ణు ఎక్కువ కష్టపడ్డట్టు కనిపిస్తుంది. నటుడిగా విష్ణు మోహన్ బాబు వారసత్వాన్ని జిరాక్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అలాకాకుండా 'డీ' సినిమాలోల తన సొంత ఐడెన్టిటి నీ ఫాలో అయితే బాగుండేది. తాప్సీ పరవాలేదనిపించినా, ఈవిడ కూడా మరో నటన రాని బంగారు బాతే. ప్రకాష్ రాజ్ తనకు కొట్టిన పిండి అయిన పాత్రలో మరోసారి తన పని తానూ చేసుకుపోయాడు. షాయాజీ షిండే, తనికెళ్ళ భరణి తదితరులు తమ పరిదిమేర బాగానే నటించారు. హోం మిస్టర్ భార్య మాజీ ప్రియుడు రాజేష్ గా బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
లస్ పాయింట్స్:
పూర్తిగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సినిమా అన్నదే 'వస్తాడు నా రాజు' సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కధ, బోరింగ్ కధనం, నవ్వురాని హాస్యం, పసలేని మాటలు, ఫీల్ లేని ప్రేమ ఇలా అన్ని కలుపుకుని 'వస్తాడు నా రాజు' లో మైనస్లు చాలానే ఉన్నాయి.
కొసమెరుపు: సలీం సినిమా 'నాకు సినిమా ఎలా తియ్యకుడదో నేర్పింది' అని అన్న విష్ణు కు 'వస్తాడు నా రాజు' చూసిన తరవాత నువ్వు నేర్చుకోవలసింది ఇంక చాలా ఉంది అని విమర్శకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment