Saturday, March 26, 2011

chattam review[చట్టం రివ్యూ ]


నటీనటులు: జగపతిబాబు, విమలారామన్‌, ఆశాషైనీ, మురళీశర్మ, రావురమేష్‌, చలపతిరావు, అమిత్‌ధావన్‌, జీవా తదితరులు,
కెమెరా: జస్వంత్‌,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
సంగీతం: శ్రీలేఖ,
నిర్మాతలు: నట్టికుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ,

దర్శకత్వం: పి.ఎ. అరుణ్‌ప్రసాద్‌.

పాయింట్‌: కసబ్‌ను తన చట్టంతో శిక్షించే పోలీసు అధికారి కథ.

ఇది సామాన్యుని మదిలో మెదిలే ఆలోచనే. నాలోనూ ఉందంటూ జగపతిబాబు, దర్శకుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. రాజకీయనాయకుల అవినీతి రాహిత్యంవల్ల దేశంలో ఎటువంటి పనైనా ఈజీగా అయిపోతుందనేది వారి గట్టినమ్మకం. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పర్మిషన్‌ ఇవ్వకపోతే లంచం ఇవ్వగానే వెంటనే పర్మిషన్‌ ఇచ్చారని దర్శకుడే స్వయంగా చెప్పాడు. చట్టం ఇలా ఉండాలని చెప్పడానికి కూడా డబ్బులు అడుగుతుంటే... దేశం ఎటువైపు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

కథగా చెప్పాలంటే... లంచగొండి పోలీసు అధికారి గౌరీశంకర్‌(జగపతిబాబు). ఏపైనా లంచం లేనిదే చేయడు. కానిస్టేబుల్‌ రంగారావు (జీవా) ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఓసారి కాలేజీ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరగడం, మరోచోట ఓ అమ్మాయి హత్యకు గురవడం జరుగుతుంది. తన పరిధిలో ఉన్న ప్రాంతం కనుక వాటి విషయంలో లంచగొండి గౌరీశంకర్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది.

విచిత్రంగా ఈ రెండు కేసుల్లోని నిందితులుగా పిలవబడేవారు హత్యకు గురవుతారు. దానిని ఛేదించే పనిలో భాగంగా సిబిసిఐడి అధికారి మురళీశర్మ వస్తాడు. తన అసిస్టెంట్‌గా గౌరీశంకర్‌ను నియమించుకుంటాడు. మరోవైపు ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాది కసబ్‌ను చంపాలనుకుంటాడు గౌరీశంకర్‌. అందుకు ఏరోబిక్‌ సెంటర్‌ నిర్వహించే సింధు (విమలారామన్‌) సహకరిస్తుంది. మరి వీరిద్దరు ఉగ్రవాదిని ఎలా అంతంచేశారు? అంతకుముందు జరిగిన రెండు హత్యలకు కారకులు ఎవరు? అనేది సినిమా.

పోలీసు అధికారిగా జగపతిబాబు పాత్ర సరిపోయింది. గతంలో లక్ష్యం, గోడమీద పిల్లి వంటి పలు చిత్రాల్లో నటించినా. అటు లంచగొండి పాత్రతోపాటు సిన్సియర్‌ ఉద్యోగిగా రెండు పార్వ్శాల్లో అతని పాత్ర ఉంటుంది. పై అధికారిగా స్టేజీ ఆర్టిస్టు మురళీశర్మ పాత్ర సహజంగా ఉంది. ఊహించినట్లుగానే విమలారామన్‌ పాత్ర కమర్షియల్‌ అంశాలకోసం పెట్టారు. గాయం-2లో జగపతిబాబుతో మంచి రొమాన్స్‌ పండించిన ఆమె ఈ చిత్రంలోనూ పండించింది. మరో నటి ఆషాశైనీని హాట్‌లాంటి పాటలో పెట్టారు. కసబ్‌గా అమిత్‌ధాన్‌ పాత్ర బాగుంది. మిగతా పాత్రలు తమ పాత్రల మేర నటించాయి.

చిత్ర కాన్సెప్ట్‌ రీత్యా ప్రభుత్వ విధానాలు, రాజకీయనాయకుల ప్రవర్తనను చించిపారేసేలా సంభాషణలున్నాయి. ఘాటైన సంభాషణలున్నాయి. విజయవాడలో వైష్ణవి చిన్నారిని కొలిమిలో కాల్చేస్తే...వారిని ఏమీచేయలేకపోవడం.... పోలీసు అధికారులకు బులెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ కొనలేని కేంద్రప్రభుత్వం... కసబ్‌ వంటి ఉగ్రవాదిని రక్షించేందుకు కోట్లాది రూపాయల ధనవ్యయం, బుల్లెట్‌ఫ్రూఫ్‌ గది... అతను మన న్యాయవాదులతో ప్రవర్తించే తీరుపై సాగే సన్నివేశాలు, సంభాషణలు సామాన్యుడి రక్తం ఉడికిపోయేలా ఉన్నాయి.

చట్టం 'నీ అబ్బసొత్తా?' అనే ట్యాగ్‌లైన్‌.. అవును.. నా అబ్బసొత్తు అన్నంతగా ఉగ్రవాదులు భావిస్తుంటే.... సిన్సియర్‌ పోలీసు అధికారి ఎటువంటి తీర్పు ఇచ్చాడన్నది చిత్రం. ముందుగానే కథ తెలిసిపోవడం ఎలా ఉన్నా... కథాగమనాన్ని మలిచిన తీరు చివరి పది నిమిషాలు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.

Friday, March 25, 2011

Wanted review 2011[వాంటెడ్ రివ్యూ 2011 ]


బ్యానర్ : భవ్య క్రియేషన్స్
విడుదలయిన తేది : Jan 26, 2011
ఒక అండర్ కవర్ కాప్ (నాజర్) బసివి (ప్రకాష్ రాజ్) అనే డాన్ కొడుకు(షఫి)ని చంపినందుకు బసివి ఆ అండర్ కవర్ కాప్ కుటుంబం మొత్తాన్ని చంపుతాడు.కానీ ఆ కుటుంబంలో డాక్టర్ చదువుతున్న అమ్మాయి మాత్రం ఎలాగో బ్రతికి బయటపడుతుంది.ఆ అమ్మాయిని పనీ పాటా లేకుండా బలాదూర్ గా తిరిగే కుర్రాడు(గోపీచంద్) ప్రేమిస్తాడు.కాని ఆమె అతన్ని ప్రేమించదు.కానీ అతని టార్చర్ భరించలేక "నాకోసం ఒకణ్ణి చంపుతావా" అని ఒక రివాల్వర్ ఇస్తుంది.ఈ కుర్రాడు ఆమె కోసం రాష్ట్ర ఐ.జి.,హోం మినిస్టర్ కూడా భయపడే బసివిని ఎలా చంపాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ కథని రివర్స్ గా చెపుతాడు దర్శకుడు.ఏ పనిచేసేవాళ్ళు ఆ పనిచేయాలి గానీ...ఎందుకులెండి.ఈ సినిమాలో ముఖ్యంగా కథ కంటే ఫైట్స్, పాటలూ ఎక్కువున్నాయంటే అతిశయోక్తి కాదు.స్క్రీన్ ప్లె బలహీనంగా ఉండటం వల్ల ఒక్కోచోట ప్రేక్షకుల సహనం పరీక్షిస్తుంది ఈ చిత్రం.ఇప్పుడు పాట వస్తుంది అని ఈ సినిమా చూసే చిన్న పిల్లలు కూడా చెప్పగలిగే స్థాయిలో ఈ చిత్రంలో పాటలున్నాయి.దర్శకత్వం మీద ఎకాగ్రతవల్ల కాబోలు రవి మాటల విషయంలో కూడా శ్రద్ధ చూపించలేకపోయాడు.దర్శకుడిగా ఒక సినిమా తీశాడే గానీ అది ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో అయితే అది లేదు. నటన- గోపీచంద్ నటనలో లోపం లేదు.అతని పాత్రను అతను సమర్థవంతంగానే పోషించాడు.దీక్షా సేథ్ నటనలో ఇంకా చాలా పరిణితి రావాల్సి ఉంది.ప్రస్తుతానికి గ్లామర్ డాల్ గానే ఆమె నటించింది.ఇక చంద్రమోహన్, జయసుధ, నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.బ్రహ్మానందం కామెడీ సెకండ్ హాఫ్ లో కాస్త పండింది. సంగీతం - చాలా పూర్ స్టాండర్డ్ లో ఉందీ చిత్రంలోని సంగీతం.ఒక పాటనుకుంటా ఫరవాలేదనిపించింది.రీ-రికార్డింగ్ ఒ.కె. సినిమాటోగ్రఫీ - ఫరవాలేదు. పాటలు - ఎబిసిడిలు,అ ఆ ఇ ఈలు,వన్ టు త్రీ ఫోర్ లతో కూడా పాట వ్రాయొచ్చని భాస్కరభట్ల ఈ చిత్రంలో నిరూపించాడు.పాటలు ఫరవాలేదు. మాటలు - ఆకట్టుకునే స్థాయిలో ఈ చిత్రంలోని మాటలు లేవు. ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - ఫరవాలేదు. కొరియోగ్రఫీ - హడావుడిగా చేసినట్టుందే కానీ చక్కగా ప్లాన్ చేసుకుని చేసినట్టు లేదీ చిత్రంలోని కొరియోగ్రఫీ. యాక్షన్ - ఇది మాత్రం అవసరానికి మించి ఈ చిత్రంలో ఉంది.అసహజంగా ఉంది.అయినా బాగుంది.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
ఈ సినిమాలో గోపీచంద్ ని ఎలాగో చూపించబోయి...ఇంకెలాగో చూపిద్దామనుకుని...మరోలాగ చూపించినట్టుంది.మీకు యాక్షన్ బాగా ఇష్టమనుకుంటే అది ఈ చిత్రంలో పుష్కలంగా ఉంది.ఇది ముఖ్యంగా బి,సి,సినిమా అనిపిస్తుంది.

Anaganaga o dheerudu[అనగనగా ఓ ధీరుడు ]


బ్యానర్ : అడోబ్ ఎంటర్ టైన్ మెంట్ మరియు వాల్ట్ డిస్నీ
విడుదలయిన తేది : Jan 14, 2011

పూర్వం అగర్తల అనే దేశంలో పసిపిల్లలు ఉన్నట్టుండి చావుబ్రతుకుల మధ్య పడి ఉంటారు.మోక్ష(హర్షిత)అనే దైవశక్తి కలిగిన పాప గనక అగర్తలకు వస్తే తమ పిల్లలు బ్రతుకుతారని అక్కడున్న ఒకమ్మాయి అంటే,ఆమెను తీసుకురావటనికి ద్రుకి(రాంజీ)అనే వ్యక్తి "నేను తీసుకువస్తానని"మోక్ష కోసం బయలుదేరతాడు.అక్కడికి వెళ్ళి మోక్షను అగర్తల వచ్చి పిల్లలను కాపాడాల్సిందిగా అక్కడున్న గురువుగారిని అడుగుతాడు.అదే సమయంలో ఐరంధ్రి(లక్ష్మీ ప్రసన్న)అనే ఒక దుష్ట శక్తి మోక్ష కోసం తన మనుషుల్ని పంపిస్తుంది.కానీ అక్కడున్న ఒక అంధ యోధడు వాళ్ళని చంపుతాడు.అతణ్ణి మోక్షకు రక్షణగా గురువు పంపుతాడు.దారిలో యోధ కావాలంటే అతనికి కళ్ళు తెప్పించగలనని మోక్ష అంటుంది.కానీ తన ప్రేయసి ప్రియ(శృతిహాసన్)లేని ఈ లోకాన్ని చూడాలనుకోవటం లేదంటాడు యోధ.మళ్ళీ మోక్ష కోసం తన మనుషుల్ని ఐరంధ్రి పంపిస్తుంది.ఈసారి కూడా యోధ వాళ్ళ బారి నుండి మోక్షను కాపాడతాడు. మోక్షను పట్టితేవటానికి తన మనుషులను ఐరంధ్రి ఈసారి కాకాసురల సాయం తీసుకోమంటుంది.కాకాసురల బారి నుండి కూడా మోక్షను యోధ కాపాడతాడు.అసలు మోక్షతో ఐరంధ్రికి పనేంటంటే నిజానికి ఐరంధ్రి పూర్తి మనిషికాదు.ఆమె తన వారసురాలైన ప్రియ నుంచి ఒక రక్తపు చుక్కని కాలనేత్రం ద్వారా తీసుకుని బ్రతుకుతూంటుంది.పూర్తిస్థాయిలో మనిషిగా మారాలంటే ఆమె మోక్షను చంద్రగ్రహణం రోజున సర్పశక్తికి బలివ్వాల్సి ఉంటుంది.అందుకామెకు మోక్ష కావాలి.చివరికి సిద్ధార్థ తన ప్రేయసి ప్రియను కలుసుకున్నాడా...?ఐరంధ్రి బారి నుండి మోక్షను యోధ కాపాడగలిగాడా....?అగర్తలలోని పసిపిల్లల ప్రాణాలు మోక్ష కాపాడగలిగిందా...? అన్న ప్రశ్ననలకు సమాధానమే మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ప్రకాష్ కోవెలమూడికిది తొలి చిత్రం అయినా అతని దర్శకత్వ ప్రతిభ చూస్తే అలా కనిపించలేదు.చాలా అనుభవమున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ప్రకాష్ కోవెలమూడి.చక్కని స్క్రీన్ ప్లే,క్లుప్తంగా అవసరమైన మేరకే మాటలూ,కన్నుల పండుగ్గా ఉండే గ్రాఫిక్స్ ఈ చిత్రాన్ని అద్భుతమైన ఐ ఫీస్ట్ గా మలచాయి.తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దొరికిన మరో ఆణిముత్యం ప్రకాష్ కొవెల మూడి అని చెప్పవచ్చు.భవిష్యత్తులో తండ్రి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేరు నిలబెట్టగల దమ్ము ఇతనిలో ఉంది.ఇందులో అనుమానం లేదు. నటన - హీరోగా సిద్ధార్థ ఒక యోధుడిలా కనపడటానికి శరీరాన్ని కూడా పెంచినట్లున్నాడు.అతని నటన బాగుంది.శృతి హాసన్ చాలా రీజనబుల్ గా నటించింది.ఈ చిత్రంలో అమదరికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసింది లక్ష్మీ ప్రసన్న గురించి. తండ్రి నుంచి నటనను వారసత్వంగా పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంది ఈమె నటన చూస్తుంటే.సహజంగా ఆమే కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి.కానీ ఐరంధ్రి వేషంలో ఆమె కళ్ళను చూస్తే చాలా పెద్దగా కనిపించాయి.నటనలో చాలా పరిణితి కనిపిమచింది.డైలాగ్‍ మాడ్యులేషన్ కూడా ఎక్స్ లెంట్ గా ఉంది. లక్ష్మీ ప్రసన్న నటన చూస్తే మోహన్ బాబు కొడుకుల కన్నా కూడా నటవారసురాలిగా ఈమే ఆయన పేరు నిలబెట్టేలా ఉందనిపించింది.lakshmi prasanna a worthy daughter of worthy father ఇంతకంటే ఆమె నటన గురించి ఇంకేం చెప్పక్కర్లేదు.అసలు ఆమె మేకప్ వేసుకోటానికే చాలా సహనం కావాలి..ఆగెటప్ మీద నటించటం అంటే... అదీ తొలిసారి ఒక అంతర్జాతీయ ప్రమాణాలున్న తెలుగు చిత్రంలో,ఒక ముఖ్యమైన,కష్టతరమైన భూమికను పోషించటం అంటే మాటలు కాదు.ఆ బాధ్యతను లక్ష్మీ ప్రసన్న అద్భుతంగా నిర్వర్తించింది. సంగీతం- నలుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేశారు.ఎవరికి వారు తమ పాటలు కొత్తగా వినిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా పోటీపడి సంగీతాన్నందించారు.ఇంతకంటే సంగీతం గురించి చెప్పక్కరలేదు.ఇక రీ-రికార్డింగ్ ని సలీం-సులేమాన్ అందించారు.వారి రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ - తెలుగు సినిమాకి అంతర్జాతీయస్థాయి ఉందని ఈ చిత్రం సినిమాటోగ్రఫీ మరోమారు నిరూపించింది.ఈ సినిమాని మనం ఊహించని రేంజ్ లో నిలబెట్టింది కెమేరానే.సౌందర రాజన్ కేమెరాపనితనం అద్భుతం. పాటలు - చక్కని సాహిత్యంతో బాగున్నాయి.ఎడిటింగ్ - చాలా నీట్ గా,క్రిస్ప్ గా ఉండి బాగుంది. ఆర్ట్ - ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోవాలి.ఐరంధ్రి డెన్ సెట్టింగ్ కానీ,మోక్ష అంతర్లోకం సెట్టింగ్ కానీ ఇలా ఈ చిత్రంలో ఆర్ట్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎక్స్ లెంట్ ఆర్ట్ డైరెక్షన్.యాక్షన్ - ఇది కూడా చాలా బాగుంది.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
ఈ సినిమా నిజానికి చిన్నపిల్లల కోసం తీసిందే అయినా...మీ పిల్లలతో పాటు మీలోని బాల్యాన్ని కూడా మీరు మరోసారి అనుభవించాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా సకుటుంబంగా హ్యాపీగా చూడండి.

Prema kavali review[ప్రేమ కావాలి రివ్యూ]


బ్యానర్ : ఆర్. ఆర్. మూవీ మేకర్స్
విడుదలయిన తేది : Feb 25, 2011



కథ - శీను (ఆది) ఖమ్మం లో ఉండే కుర్రాడు.అతను హైదరాబాద్ లో చదువుకుంటూ ఉంటాడు.అతనికి తన కాలేజీలో చదివే ప్రేమ(ఇషా చావ్లా) అనే అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడుతుంది.అది ప్రేమగా మారుతుంది.ఆమె తండ్రి చంచల్ గూడా జైలర్ విజయ రామారావు (నాజర్). ఆమె వదిన సింధూ తులానీ.ఆమె గుడికి వెళ్తూంటే కొందరు దుండగులు ఆమెను అటకాయిస్తారు.ఆ సమయంలో శీను ఆమెను కాపాడతాడు.అలా ఆమెకు దగ్గరవుతాడు శీను.శీను కాలీజీలో యన్ సి సి లో అండర్ ఆఫీసర్ గా ఉంటాడు. ట్రైనింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళాల్సి వస్తుంది.ప్రేమను వదిలి వెళ్ళాలంటే అతనికి బాధగా ఉంటుంది.ఆమెను రెండు నెలల పాటు చూడటం కుదరదు అనే భావనతో శీను ఉండగా,ఆమెను ఆ సందర్భంలో ఆంను ముద్దుపెట్టుకుంటాడు శీను. దాన్ని వ్యతిరేకిస్తుంది ప్రేమ.శీను హిమాచల్ ప్రదేశ్ కి వెళతాడు.

ఇదంతా తర్వాత మనకు తెలుస్తుంది. ప్రేమను శీను ముద్దు పెట్టుకునే దృశ్యాన్ని బాబ్జి(షఫీ) తన సెల్ ఫోన్ లో ఫొటో తీసి ప్రేమను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.ఇంతకీ విషయమేమిటంటే ఒక తీవ్రవాదిని చంచల్ గూడా జైలు నుంచి విడిపించటానికి ముంబాయిలో ఉన్న ఠాకూర్ (దేవ్ గిల్) అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అతని ఆజ్ఞ మేరకు హైదరాబాద్ లో ఉండే బాబ్జి తన అనుచరులతో కలసి ప్రేమను కిడ్నాప్ చేసి, తద్వారా ఆ ఉగ్రవాదిని విడిపించాలని భావిస్తాడు. కానీ శీను వల్ల అది కుదరదు.తర్వాత ఆ ఉగ్రవాదిని మరో జైలుకి తరలిస్తున్నారని తెలుసుకున్న ఠాకూర్, జైలర్ విజయరామారావు ఇ-మెయిల్‍ పాస్ వర్డ్ ప్రేమ ద్వారా తెలుసుకోమని బాబ్జిని ఆదేశిస్తాడు.తన ఫొటో కోసం తండ్రి ఇ-మెయిల్ పాస్ వర్డ్ తెలుసుకుంటుంది ప్రేమ.అది తెలుసుకున్న ఠాకూర్‍ బృందం ఉగ్రవాదిని వేరే జైలుకి తరలిస్తూండగా దారిలో విడిపించుకుంటారు. జైలర్ ని హోం మినిస్టర్ సస్పెండ్ చేస్తాడు. దాంతో జైలర్ తన కూతురు ప్రేమను దండిస్తాడు. అది చూసిన శీను ఆ ఉగ్రవాదిని తిరిగి ఎలా తీసుకు వచ్చాడు, తన ప్రేమను ఎలా పొంద గలిగాడన్నది మిగిలిన కథ.



ఎనాలసిస్ :

విశ్లేషణ - దర్శకుడు విజయభాస్కర్ ఎలాంటి దర్శకుడో అతని "నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి" చిత్రాలే చెపుతాయి.అతని దర్శకత్వ ప్రతిభ గురించి ఎలాంటి అనుమానం అక్కరలేదు.ఇది యువతకు నచ్చే ప్రేమకథ కనుక యూత్ ఫుల్ గా ఈ చిత్రాన్ని మలచటంలో దర్శకుడు ఈ చిత్రం ద్వారా మరోసారి సఫలీకృతుడయ్యాడు. సినిమా తొలి సగమంతా ఎంటర్ టైన్ మెంట్ తో సాగి సెకండ్ హాఫ్ లో యాక్షన్ పార్ట్ ని జోడిస్తాడు దర్శకుడు. విజయభాస్కర్ రోటీన్ సక్సస్ ఫార్ములానే అనుసరించినా, దాన్ని కొత్తగా వాడుకోవటంతో సినిమా ఎక్కడా బోరుకొట్టలేదు.

నటన - ఆది తాతయ్య పి.జె.శర్మ, తండ్రి సాయికుమార్ ఇద్దరూ నటులే కావటంతో అతనికి నటనలో మెళుకవలు బయట ఎక్కడో నేర్చుకోవాల్సిన పనిలేదు.అలాంటి నట వంశానికి చెందిన మూడో తరం నటుడు ఆది పూర్తి స్థాయిలో తర్ఫీదు పోంది మరి సినీ రంగానికి హీరోగా పరిచయం చేయబడ్డాడని ఈ చిత్రంలోని అతని నటన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. నేటి తరం యువ హీరోకి కావలసిన అన్ని లక్షణాలూ ఆదిలో పుష్కలంగా ఉన్నాయి.అతను ఈ చిత్రంలో డ్యాన్సుల్లో, ఫైట్స్ లో పూర్తి ఎనర్జిటిక్ గా నటించాడు. ఇది అతని తొలి చిత్రమైనా అతనిలో ఆ కొత్తదనం ఎక్కడా కనిపించదు.పైగా ఎంతో అనుభవమున్న హీరోలా చక్కగా నటించాడు ఆది. యువ హీరోగా అతనికి మంచి భవిష్యత్తుంది.

ఇక హీరోయిన్ ఇషా చావ్లా కూడా బాగానే నటించింది. బ్రహ్మానందం, యమ్ యస్ నారాయణల కామేడీ బాగానే పండింది. ఆలీ కూడా కాసేపు మనల్ని నవ్విస్తాడు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఈ చిత్రం సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ కు మంచి బ్రేక్ నిస్తుంది.అన్ని పాటలూ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. కెమెరా - ఛోటా కె నాయుడు కేమెరా పనితనం గురించి ఈ రోజున కొత్తగా చెప్పక్కరలేదు. కేమెరా వర్క్ చాలా బాగుంది.

మాటలు - మాటల్లో కొన్ని పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రసాద్ వర్మ మాటలు బాగున్నాయి.

పాటలు - విజయభాస్కర్ చిత్రాల్లో పాటలు మామూలుగానే బాగుంటాయి.సాయికుమార్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రంలోని పాటల్లోని సాహిత్యం ఇంకాస్త బాగుందనే చెప్పాలి.

ఎడిటింగ్ -ఈ చిత్రానికి ఎడిటర్ గౌతంరాజు. ఈయన కొన్ని వందల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన అనుభవశాలి. ఎడిటింగ్ బాగుంది.

ఆర్ట్ - రవీందర్ కళాదర్శకత్వం బాగుంది. పాటల్లో వేసిన సెట్స్ బాగున్నాయి. కొరియోగ్రఫీ - కొరియోగ్రఫీ అన్ని పాటల్లోనూ బాగుంది.

యాక్షన్ - రామ్-లక్ష్మణ్ యాక్షన్ కంపోజింగ్ బాగుంది.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

అశ్లీలత, అసభ్యత లేని ఒక క్లీన్ యూత్ ఫూల్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ చిత్రం హ్యాపీగా చూడొచ్చు.

Dongala mua review[దొంగల ముఠా రివ్యూ]




సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్‌
నటీనటులు: రవితేజ , చార్మి , మంచు లక్ష్మీప్రసన్న, ప్రకాష్‌ రాజ్‌, సుబ్బరాజు, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సుప్రీత్‌, అజయ్‌ తదితరులు.
సంగీతం: అమర్ మహెలే
కథ: నీలేష్
డైలాగులు :వేణు
ఆర్ట్ : కృష్ణ మాయ
నిర్మాత: కిరణ్‌ కుమార్‌ కోనేరు
దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ
విడుదల తేదీ: మార్చి 18, 2011



"ఈ సినిమాకి ఆరున్నర లక్షలు ఖర్చయింది. ఐదు రోజుల్లో షూటింగ్ చేసాను.ఈ చిత్రం ఒక్క షో ఆడినా అది హిట్టే" అంటూ గత కొద్ది రోజులుగా ఊదరకొడుతున్న వర్మ 'దొంగలముఠా' ఆర్భాటంగా విడుదలైంది. అలాగే ఆయన కోరుకున్నట్లుగానే ఒక్క షో సినిమాలాగానే ఆడేటట్లు...ఆ ఆరు లక్షలే వచ్చేటట్లు కనపడుతోంది. రవితేజ,చార్మి వంటి స్టార్స్ ఉన్నా మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలని ఈ సినిమా సాంకేతికంగా (కేనన్ 5 కెమెరా ల ఎఫెక్టు) చాలా పూర్ గా ఉంది. సినిమా అంతా మసక ..మసకగా ఉన్న ఈ చిత్రం కథ,కథనాల పరంగానూ జాగ్రత్త తీసుకోకపోవటంతో ప్రేక్షకుడుకి సహన పరీక్షే ఎదురైంది.

సుధీర్(రవితేజ) తన భార్య రాణి(చార్మి)ని తీసుకుని ఆమె ప్రెండ్ పెళ్ళికి కారులో బయిలుదేరతాడు. అన్ని ధ్రిల్లర్ సినిమాల్లోలాగానే ఓ నిర్మానుష్య ప్రదేశానికి వచ్చేసరికి కారు ట్రబుల్ ఇస్తుంది. దాంతో అందరూ ఊహించినట్లుగానే ఎదురుగా ఉన్న ఓ రిసార్టు లోకి వెళతారు. ఇక అప్పటికే ఆ రిసార్టుని విచిత్రంగా బిహేవ్ చేసే ముగ్గురు (సుబ్బరాజు, సుప్రీత్,బ్రహ్మాజి) ఆక్యుపై చేసి ఉంటారు. వీళ్ళు విలన్స్ అని అర్ధం కావటానికి హీరోకి కాస్త టైమ్ పడుతుంది. ఆ తర్వాత తన భార్యని తీసుకుని అక్కడనుంచి తప్పించుకు పోదామనకుంటాడు. కానీ రాణి మీద కన్నేసిన వాళ్ళు వీళ్ళని అంత తేలిగ్గా వదులుతారా..అలాంటి స్ధితిలో ఇరుక్కుపోయిన సుధీర్ ఏం చేసాడు...ఈ కథకీ మంచు లక్ష్మి కి సంభందం ఏమిటి, బ్రహ్మానందం ఈ ట్రూప్ లోకి ఎలా వచ్చి పడ్డాడు అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రవితేజ వంటి స్టార్ చేతిలో ఉన్నాడు... ఐదు రోజుల షూటింగ్,జీరో బడ్జెట్ ఐడియా మైండులో ఉంది...ఎలాగూ మీడియా మనమేం చెప్పినా హైలెట్ చేసి పబ్లిసిటీ చేస్తుంది...ఇవి చాలు..వీటితో ఎలాగయినా ప్రేక్షకులను బురిడి కొట్టించవచ్చు అన్నట్లు వర్మ ఆలోచించి ఈ చిత్రం ప్రారంభించినట్లు తెలిసిపోతుంది. ఆయన సిన్సియర్ ప్రయత్నం చిత్రంలో ఎక్కడా కనపడదు. జీరో బడ్జెట్ తో తీసినా ప్రేక్షకుడు మాత్రం డబ్బులు పెట్టి టిక్కెట్టు కొనుక్కుని వస్తాడు అని ఆయన ఆలోచించలేదు.అంతగా నమ్మివచ్చిన వాడిని దృష్టిలో పెట్టుకుని కాస్త కథ,కథనాన్ని అయినా సరిగ్గా వండలేదు.దాంతో ఫస్ట్ హాఫ్ చూసాక చాలా బోర్ అనిపిస్తుంది. అయితే సెకెండాఫ్ చూసాక..ఫస్టాఫ్ అద్బుతం అనిపిస్తుంది. అంటే అంత బోర్ గా సెకెండాఫ్ ని రన్ చేసారు.

ఇక హీరో రవితేజ చిత్రంలో చేయటానికి ఏమీ ఉండదు..కేవలం డైలాగులు చెపుతూ అటు ఇటు పరుగెట్టడం తప్ప..ఇక చార్మి అయితే తన భారీ అందాలును సాధ్యమైనంతవరకూ కెమెరా ముందు పరుస్తూ, ఇరిటేటింగ్ గా డైలాగులు విరిచి చెపుతూ ఉంటుంది. ఆమెకు పోటీ లక్ష్మీ ప్రసన్న. ఆమె నటన,డైలాగు డెలవరీ మరీ పేలవంగా..కావాలని చెప్తున్నట్లు ఉంటుంది.పోనీ కామిడికి బ్రహ్మానందం ఉన్నాడుకదా అని సర్ధిపెట్టుకుందామనుకుంటే ఎక్కడా పొరపాటున కూడా ఆయన నవ్వించడు. అంతెందుకు ప్రకాష్ రాజ్ వంటి ఆర్టిస్టు కూడా ఏమీ చెయ్యలేకపోయాడంటేనే అర్దం చేసుకోవచ్చు. అయితే ఐదు రోజుల సినిమాకు అంతకు మించి ఎక్సపెక్టు చేయకూడదు అని మీరు అనొచ్చు...కానీ చూసేవాళ్ళకు సంవత్సరం తీసిన సినిమా అయినా ఇరవై నాలుగు గంటల్లో తీసినా సినిమా అయినా ఒకటే అని గుర్తు చేసుకోవాలి.

అలాగే నేపధ్య సంగీతం ఏదో హర్రర్ చిత్రానికి ఇచ్చినట్లు ఉంది. డైలాగులు గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో చెప్పినట్లుగా ఒకే పదాన్ని పది సార్లు పదిమంది చేత చెప్పించి నవ్వించే విఫల ప్రయత్నం చేసారు.ఇక కేనన్ 5 కెమారాలు అద్భుతం అంటూ చెప్పిన వర్మ ఈ అవుట్ పుట్ చూసిన తర్వాత కూడా కంటిన్యూగా వీటితోనే సినిమాలు చేస్తారామో చూడాలి. అయితే ఈ సినిమాలో అన్నీ మైనస్ లేనా ఒక్క ప్లస్ లేదా అంటే ఉంది. అదే నిడివి. చక్కగా గంటన్నర తో ఈ చిత్రాన్ని ముగించి ప్రేక్షకులను మూకుమ్మిడిగా రక్షించారు.

ఫైనల్ గా ఈ ఐదు రోజుల ప్రయోగం అవుట్ ఫుట్ ఎలాగుంది అని చూడటానకైతే ఈ సినిమాకి వెళ్ళాలి. లేకపోతే హాయిగా ఓ నెలరోజుల్లో ఏదో ఛానెల్లో దీనిని చూడటం మేలు. ఎందుకంటే పెద్ద తెరపై మసకగా వచ్చే ఈ చిత్రం టీవీల్లో క్లారిటీగా కనిపిస్తుంది. అలాగే రవితేజ చిత్రం లేదా రామ్ గోపాల్ వర్మ చిత్రం అని వెళ్ళకుండా ఏదో హాలీవుడ్ సి గ్రేడ్ చిత్రం తెలుగు డబ్బింగ్ చూడటానికి వెళ్ళుతున్నాం అని ప్రిపేర్ అయి వెళితే ఏ బాధా ఉండదు. ఏదైమైనా ఈ చిత్రం తర్వాత వర్మ నమ్మకం కోల్పోయి ప్రేక్షకులకోసం వేట ప్రారంబించాలి అని జనాలు అనుకోవటం నిజం అయ్యేటట్లు కనపడుతోంది.

Mangala review[మంగళ రివ్యూ ]


సంస్థ: మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: చార్మి, ప్రదీప్‌ రావత్‌, విజయ్‌ సాయి, ఉత్తేజ్‌, సుభాష్‌, సారిక రామచంద్రరావు తదితరులు
సంగీతం: విశ్వ
నిర్మాత: సిహెచ్‌.వి.శర్మ, తులసీరామ్‌
దర్శకత్వం: ఓషో తులసీరామ్‌

మంత్ర కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఛార్మీ, దర్శకుడు తులసీరామ్ ప్రేక్షకులపై సంధించిన చిత్రం మంగళ. మంత్రలో ఏమైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని వదిలేసి చార్మి గ్లామర్ నే పెట్టుబడిగా భావించి చేసిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకుంది. అయితే మార్నింగ్ షోకే మామూలు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ రేంజిలో నిలబడుతుందా అనేది ప్రశ్నార్దకంగా మారింది. చాలా కాలం షూటింగ్ చేసుకుని, ఆర్దికపరమైన ఒత్తిళ్ళను తప్పుకుని ఈ చిత్రం తులసీరామ్ కెరీర్ కీ,వరస ఫ్లాపుల చార్మీ కెరీర్ కీ చాలా కీలకమైంది. ప్రేక్షకుల ఆదరణతో ఇచ్చే తీర్పుపై వారి కెరీర్ లు ముందుకెళ్ళటం ఆధారపడి ఉంటుందనేది నిజం.

మాంత్రికుడు ముత్తయ్య(ప్రదీప్ రావత్) కి కొడుకు చిన్నా అంటే ప్రాణం. చిన్నా కి సినిమా హీరోయిన్ మంగళ (చార్మి)కు వీరాభిమాని. దాంతో అతను ఆమెను కలుసుకుని కారు బహుమతిగా ఇవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే అనుకోకుండా జరిగిన ఓ పొరపాటు కారణంగా చిన్నా దెబ్బలు తింటాడు. తానూ చేయకపోయినా జరిగినదానికి అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు. దానితో మంగళ మీద కసి పెంచుకున్న ముత్తయ్య భయంకరమైన క్షుద్ర శక్తి శకుచి ని ప్రయోగిస్తాడు. దాని ప్రభావంతో మంగళ రకరకాల కష్టాలు పడుతుంది. వాటికీ కారణం క్షుద్ర ప్రయోగమనీ, దానిని ఆపాలంటే ప్రయోగించిన వాడే నివారించాలి అని తెలుసుకుని క్షమించమని వేడుకోటానికి వెళ్ళేప్పటికి అక్కడ ముత్తయ్య చనిపోయుంటాడు. ఇక అక్కడనుండి మంగళ ఏవిదంగా ఆ ఘోర పరిస్థితిని ఎదుర్కుని ఆ ప్రమాదం నుండి బయటపడింది అనేది మిగిలిన కధ.

మంగళ విశ్లేషణకు వస్తే చార్మి పూర్తిగా భుజాన వేసుకుని చేసిన చిత్రం ఇది. ఆమె మంగళ పాత్రను పూర్తి ఫెరఫెక్షన్ తో చేయటానకి ప్రయత్నించినా దర్సకుడు దృష్టి మాత్రం ఆమె గ్లామర్ పైనే ఉండటం మైనస్ అయింది. ఇక మంత్రలో చేతబడి,క్షుద్ర విధ్యలు, దెయ్యాలు వంటివి లేవని చెప్పి విజయం సాధించిన దర్శకుడు ఈ సారి చేతబడి,శకూచి వంటివి ఉన్నాయనే కోణంలో కథ నడిపి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు.అలాగే ఇలాంటి సినిమాలకు టెక్నికల్ గా అడ్వాన్స్ గా ఉంటేనే హాలీవుడ్ హర్రర్ సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకుడిని అలరించగలిగేది. అయితే ఈ చిత్రంలో చాలా ఉపయోగించిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ పై ఎంతో ఆశలు పెట్టుకుని ఈ చిత్రం రూపొందించినట్లు అర్దమవుతుంది. కానీ ఆదీ పండలేదు. అయితే ఈ సినిమాను చార్మి అభిమాలు మాత్రం ఐస్ ..ఐస్ పాట కోసం చూడొచ్చు. స్టెప్స్ బాగుంటాయి.

ఫైనల్ గా ఓ హర్రర్ సినిమాకు వెళ్థున్నా మనం భయపడాలి అని ఫిక్స్ అయిన వారు మాత్రమే ఈ చిత్రం చూడ్డానికి వెళ్ళటం బెస్ట్ . అలాగే మంత్ర రేంజిలో ఊహించుకుని వెళితే మాత్రం పూర్తి నిరాశ ఎదురవుతుంది.వర్మ రెగ్యులర్ హర్రర్ సినిమాల చూడ్డానకి అలవాటు పడ్డ వారికైతే ఈ చిత్రం బాగానే ఉందనిపిస్తుంది.

Aha na pellanta review[అహ నా పెళ్ళంట రివ్యూ ]


బ్యానర్: ఎ కె ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: అల్లరి నరేష్, రితూ బర్మేచా, శ్రీహరి, సుబ్బరాజు, అనిత, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు
పాటలు: భాస్కర్ భట్ల, రామ జోగయ్య, సిరాశ్రీ, భువన్ చంద్ర
సంగీతం: రఘు కుంచే
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్
నిర్మాత: సుంకర రామ బ్రహ్మం
విడుదల తేదీ: 02/03/2011

నవ్వటం ఎంత ఈజీనో..నవ్వంచటం అంత కష్టం అనేది తెలిసిందే. అలాగే కామెడీలో పంచ్ మిస్సైతే ప్రేక్షకుడు ముఖంపై పంచ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది అని సినీ అనుభవజ్ఞులు చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఓ కొత్త దర్శకుడు కామిడీతో ముందుకు వచ్చాడంటే అది అతని దర్శకత్వం పై ఉన్న నమ్మకమని చెప్పాలి. కామిడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అల్లరి నరేష్ తో వీరభధ్రమ్ దర్సకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన అహనాపెళ్ళంట ఈ రోజు రిలీజైంది. రెగ్యులర్ అల్లరి నరేష్ చిత్రాలకు కొద్దిగా భిన్నంగా లవ్ ఫీల్ ని కూడా జత చేస్తూ వచ్చిన ఈ చిత్రం నవ్వులు బాగానే పూయించింది. అలాగే ఎక్కడా అసభ్యత, మితిమీరిన హింస లేకపోవటంతో ఫ్యామిలీలకు కూడా ఇబ్బంది ఉండదు.

ముగ్గురు రౌడీ అన్నలు తమ ముద్దుల చెల్లెలుకి చేసే వివాహ ప్రయత్నంలో ఇరుక్కుపోయిన సాప్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు కధే ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు(సుబ్రమణ్యం) రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తల్లి తండ్రిలేని అనాధ, బుద్దిమంతుడు,బ్రహ్మచారి,నిజాయితీపరుడు మరెన్నో లక్షణాలు ఉన్నవాడు.ఇక సంజన(రీతూ బర్మెచ) ఓ ముగ్గురు రౌడీలు(శ్రీహరి,సామ్రాట్,సుబ్బరాజు)ముద్దుల చెల్లెలు. ఆమెకు తన అన్నలు రౌడీలు కావటంతో మ్యారేజ్ సమస్య అవుతుంది( అదేంటి మగపిల్లలు ఎక్కువైన ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి కూడా సమస్యేనా అనొద్దు). అప్పుడు ఈ అన్నయ్యలు ప్లాన్ చేసి సుబ్బుని తమ బావగా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే సుబ్బు అప్పటికే తన ఆపీసులో పనిచేసే అనితతో ప్రేమలో ఉంటాడు. మరి ఈ అన్నయ్యల కోరిక నెరవేరిందా. సుబ్బు ప్రేమించిన అమ్మాయిని ఏం చేసాడు అన్నది మిగతా కథ.

సాధారణంగా కామిడీలో సస్పెన్స్ ఉండకూడదని చెప్తూంటారు. అయితే ఈ చిత్రం రివర్స్ గేర్ లో వెళ్తూంటుంది. అల్లరి నరేష్ వైపు నుంచి కథ నడుపుతూండటంతో హీరోయిన్ అన్నయ్యల ప్లాన్ దాచి పెట్టడంతో కావాల్సిన విధంగా నవ్వులు రాలవు. అదే మొదట కథలో కీలకమైన హీరోయిన్ అన్నయ్యల పాత్రలని ఓపెన్ చేసి వారి వైపు నుంచి కథ చెప్పితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే ఆ లోటుని బ్రహ్మానందం పాత్ర కామిడీతో పూరిస్తుంది. ఇక ఈ చిత్రం చూస్తూంటే బాలీవుడ్ వెలకమ్, కొరియన్ సినిమా మ్యారీయింగ్ మాఫియా సీన్స్ వచ్చి పోతూంటాయి. అయితే అవి కథ లో ఇమిడిపోవటంతో ఇబ్బందిగా ఉండదు. ఇక సెకెండాఫ్ కి వచ్చేసరికి లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. అయితే సెకెండాఫ్ లో బ్రహ్మానందం,శ్రీహరి మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. పాటల విషయానికి వస్తే పెళ్ళి చేసుకోరా అనే పాట బాగా పేలింది. డైలాగులు కొన్ని బాగున్నా మరికొన్ని ఓవర్ లాప్ లో పోయాయి. నటీనటులు విషయానకి వస్తే అల్లరి నరేష్ ఎప్పటిలాగే ఈజ్ తో చేసుకుపోయాడు. హీరోయిన్ గా పరిచయమైన అమ్మాయి కొంచెం నటన కూడా చేస్తే బావుండనినిపిస్తుంది. బ్రహ్మానందం, కృష్ణభగవాన్,ఎమ్మెస్ నారాయణ, సుబ్బరాజు వంటి సీనియర్స్ తమదైన శైలితో నవ్వించే ప్రయత్నం చేసారు. ఇక హీరోతో సమానంగా చేసిన శ్రీహరి పాత్ర ఢీ,కింగ్ చిత్రాల్లో పాత్రను గుర్తు చేస్తూ సాగుతుంది. టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగా బ్యాడ్ గా ఉంది. ఎడిటింగ్ మరింత షార్పుగా ఉందనిపిస్తుంది. దర్సకుడుగా భద్రమ్ ..నటీనటుల నుంచి కావాల్సిన మేరకు మంచి నటననే రాబట్టారు. మంచి కథ,కధనం తయారుచేసుకోగలిగితే బాగా డీల్ చేయగలడని అనిపిస్తుంది.

ఫైనల్ గా ఈ చిత్రం కథలో కామిడీతో పాటు సస్పెన్స్ ను కూడా ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. ఇవివి సత్యనారాయణ కి అంకితమిచ్చిన ఈ చిత్రం ఆయన తరహా కామిడీని ఆశించేవారిని నిరాశపరచదు. కాబట్టి మొహమాటపడకుండా ఈ అహనా పెళ్ళంటకి వెళ్ళి నవ్వుతూ నాలుగు అక్షింతలు వేసి రావచ్చు.

Gaganam review[గగనం రివ్యూ]


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: అక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనాఖాన్
సంగీతం: ప్రవీణ్ మణి
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: రాధామోహన్
తేది: 11/02/2011

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై దిల్ రాజు నిర్మించిన 'గగనం' చిత్రానికి ఆకాశమంత ఫేం రాధా మోహన్ దర్శకత్వం వహించాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, పునంకౌర్, సనాఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాటలు లేని ఈ సినిమాకు ప్రవీణ్ మణి నేపధ్య సంగీతాన్ని సమకూర్చారు. కే.వి.గుహన్ సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ .కె.వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు. పాటలు, ఫైట్లు, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా కధను నమ్మి నిర్మించిన ఓ ప్రయోగాత్మక చిత్రం అని చెప్పి సినిమా చూడటానికి ఏవిధమైన అంచనాలు పెట్టుకోకుండా రండి అని ప్రచారం చేసి మంచి ఫలితాలనే రాబట్టుకున్నారు నాగార్జున, దిల్ రాజు. ఇది ఒక మంచి చిత్రం, ఇక ఫై ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో రావటానికి నిజాయితితో చేసిన ప్రయత్నం అని నాగార్జున నమ్మకంగా చెప్పాడు.

ఇక కధ విషయానికి వస్తే బిన్న నేపద్యాల నుండి వచ్చిన ప్రయాణికులు చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళటానికి స్టార్ జెట్ అనే విమానం ఎక్కుతారు. బయలుదేరిన కొద్ది సమయానికే ఐదుగురు టెర్రరిస్ట్ లు విమానాన్ని హైజాక్ చేస్తారు. దాంతో తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అవుతుంది విమానం. 100 కోట్ల నగదు తో పాటు వారి నాయకుడు యూసఫ్ ఖాన్ ను కూడా విడుదల చేయాలి లేదంటే విమానంగగనం రివ్యూ]లో ఉన్న 100 మందిని చంపేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం తో అలెర్ట్ అయిన ప్రభుత్వం వారితో చర్చలకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి నేషనల్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ వి.రవీంద్ర(నాగార్జున)ను పిలిపిస్తారు. హోం సెక్రటరీ విశ్వనాధ్ (ప్రకష్ రాజ్) ను కమాండో యాక్షన్ కోసం అడుగుతాడు రవీంద్ర.

కానీ విమానంలో ఓ కేంద్ర మంత్రి ఉండటం, రాబోయే మూడు నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు. చివరికి చేసిది ఏమి లేక యూసఫ్ ఖాన్ ను విడుదల చేయటానికి నిర్ణయిస్తారు. తానే స్వయంగా పట్టుకున్న యూసఫ్ ఖాన్ ను వదిలిపెట్టడం ఇష్టంలేని రవీంద్ర తన ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే జైలు నుండి తీసుకువస్తున్న యూసఫ్ ఖాన్ వాహనానికి ప్రమాదం జరిగి అతను మరణిస్తాడు. కానీ ఆ విషయాన్నీ నమ్మే పరిస్థితిలో టెర్రరిస్ట్‌లు సిద్దంగా లేరు. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితులను తన అధినంలోకి తీసుకున్న రవీంద్ర తెలివిగా వ్యవహరించి ఆపరేషన్ 'గగనం' కు రూపకల్పన చేస్తాడు. ఇక అక్కడ నుండి ఆపరేషన్ 'గగనం' ఏవిధంగా విజయం సాధించింది అన్నది మిగిలిన కధ.

మూస సినిమాలను చూసి చూసి విసుగెత్తి పోయిన తెలుగు ప్రేక్షకులను 'గగనం' సినిమా ఓ కొత్తరకం అనుభూతితో అలరిస్తుంది. ఆరు పాటలు, ఆరు ఫైట్ లు, పంచ్ డైలాగులు, హీరోయిన్ తో రోమాన్స్ వంటి ఏ విధమైన వ్యాపారాత్మక అంశాలు లేకుండా కేవలం కధ, కధనంలోని వైవిద్యంతోనే ప్రేక్షకులను కట్టిపడేసారు ఈ సినిమా రూపకర్తలు. లాజిక్ మిస్సవ్వకుండా, అనవసరపు హడావిడి లేకుండా, సున్నితమైన హాస్యంతో కధ పట్టు తప్పకుండా చాల జాగ్రత్తగా కధనాన్ని తయారు చేసుకున్నారు దర్శకుడు రాధా మోహన్. లాజిక్ ను కాపాడే ప్రయత్నంలో మొదటి సగం కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ మలుపును ఆసక్తి కరంగా మొదలుపెట్టి ఆతరవాత దాన్నిబ్యాలెన్స్‌గా నడిపించి ముగించిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది.

అది ఎంతలా అంటే ఈ సినిమాలో పాటలు లేవే, రొమాన్స్ లేదే అన్న ఆలోచనే ప్రేక్షకుడికి రాదు. ఉమర్జి అనురాధ మాటలు కధకు అనుగుణంగా చక్కగా ఉన్నాయి. గుహన్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ తో పాటు మిగతా అన్ని విభాగాలు సమర్దవంతంగా తమ భాద్యతలను నిర్వర్తించాయి. టాలెంట్ ఉన్న కొత్త వారిని పరిచయం చేయడమే కాదు 'గగనం' వంటి కొత్త తరహ చిత్రాలను నిర్మిస్తూ తెలుగు సినిమా భవిష్యత్తు గమనాన్ని నేర్దేశించడంలో తన వంతు భాద్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్న నిర్మాత దిల్ రాజు మనం అందరం మనసుపూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా కాకుండా ఓ ప్రధాన పాత్రగా కనిపించడం విశేషం. ఎందుకంటే ఈ సినిమాలో హీరో కధ కాబట్టి. మిలిటరీ ఆఫీసర్ గా చాలా హుందాగా, ఠీవిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక పొతే బ్రహ్మానందం తనదైన శైలిలో నటించి కడుపార నవ్విస్తాడు. ముఖ్యంగా రంగనాథ్ అలియాస్ యూసఫ్ ఖాన్ పాత్ర గుర్తుకువచ్చినప్పుడల్లా నవ్వుతెప్పిస్తుంది. నాగార్జున, బ్రహ్మానందం వంటి వారు కాకుండా చాల మంది మనకు తెలియని నటులే సినిమా నిండా ఉన్నా అక్కడ పాత్రలే కనిపిస్తాయి కానీ వ్యక్తులు కనిపించరు. ఏది అయితేనేం మంచి కధ, దానిని తెరకెక్కించిన విధానం, సున్నితమైన హాస్యం, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాని సక్సెస్ వైపు నడిపిస్తాయి

jai bolo temgana review[జై బోలో తెలంగాణ రివ్యూ ]


సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్స్
‌ నటీనటులు: జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌, గౌరీశంకర్‌, గద్దర్‌,
వేదకుమార్‌, దేశపతి శ్రీనివాస్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, డా.శ్రవణ్‌ తదితరులు.
డైలాగులు: ఊడుగల వేణు
కెమెరా: టి సురేంద్ర రెడ్డి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: చక్రి
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత-దర్శకుడు: ఎన్‌.శంకర్

"ఓ తెలంగాణ బిడ్డగా నా బాధ్యతగా భావించి ఈ సినిమాను తీశాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఉత్తేజం, ఉద్వేగం నాలో కలుగుతోంది "అంటూ ఉద్వేగంగా దర్శకుడు ఎన్.శంకర్ తను రూపొందించిన "జై బోలో తెలంగాణ" చిత్రం గురించి ఇన్నాళ్లుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ మాటల్లో ఉన్న ఉద్వేగం, భాధ్యత సినిమాలో ఎంతవరకూ ప్రతిబింబించింది, ఎంతవరకూ ప్రతిఫలించిందీ అంటే ధియోటర్లలో డైలాగులుకు వస్తున్న స్పందనంత, గద్దర్ పాటకు వేస్తున్న స్టెప్పుల్లో ఉన్న ఉత్సాహమంత అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే "జై బోలో తెలంగాణ" అని టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఏకపక్షంగా ఉద్యమాన్ని చూపెడతారని అంతా భావించారు. అదే జరిగింది..కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందీ లేదు. ఇక ప్రధానపాత్ర వేసిన జగపతిబాబు కెరీర్ కి ఈ సినిమా ఎంతవరకూ ఉపయోగపడుతుందనే దానికన్నా...ఈ సినిమాకి మాత్రం జగపతిబాబు వెన్నుముకలా నిలబడ్డారనేది నిజం.

ప్రత్యేక తెలంగాణా కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న కుటుంబం బందగి గోపన్న(జగపతిబాబు)ది. ఆయన కూడా పోరాటంలో పాల్గొని ప్రాణాలు వదులుతాడు. ప్రస్తుతం ఆయన కొడుకు వర్షిత్‌ (సందీప్‌) తరం నడుస్తూంటుంది. వర్షిత్ తన తల్లి జయమ్మ(స్మృతి ఇరానీ) తో కలిసి ఉంటూంటాడు. తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించం ఇష్టపడని అతను చదువుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి విజయవాడకు చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన ఆంద్రా అమ్మాయి సహజ (మీరా నందన్‌) పరిచయమవుతుంది. పరిచయం ప్రేమదాకా పోతుంది. అయితే ఈ లోగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన అతనికి తెలంగాణా పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేది మిగతా కధ.

ఉద్యమ నేపధ్యంలో తెలంగాణా అబ్బాయి..ఆంధ్రా అమ్మాయి మధ్య నడిపిన ప్రేమ కథ ఇది. అలాగే తరతరాలుగా వస్తున్న సినిమా రూల్స్ ప్రకారం అమ్మాయి కుటుంబం విలన్ అవుతుంది. అలాగే ఆమె ప్రేమించిన వాడితో కాకుండా వేరే వారితో సంభందం నిశ్చయమవుతుంది. ఆ చేసుకోబోయేటోడు వచ్చి హీరోకు వార్నింగ్ ఇస్తాడు. మరో ప్రక్క వితంతురాలైన హీరో తల్లి..ఆమెనే ఈ ఇంటికోడలుగా తెచ్చుకోవాలని నిర్ణయించుకుని దానికోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అంటుంది..ఇలా కథగా చూస్తే...రొటీన్..ప్రేమ కథ ఇది అని అర్దమవుతుంది. అయితే ఇక్కడే దర్శకుడు ఎన్.శంకర్ ప్రతిభ అంతా ఆ ప్రేమ కథని ..ఉద్యమానికి ముడి వెయ్యటంలోనే చూపెట్టాడు. వర్తమాన కాలంలో జరిగిన ఉస్మానియా కాల్పులు, చారి మరణం, కేసీఆర్ నిరాహార దీక్ష, చిదంబంర ప్రకటన వంటివి ఈ కథను నిలబెట్టాయి. అందులోనూ నెగిటివ్ గా చూపెట్టిన తెలంగాణేతర ప్రాంత పాత్రలు కూడా కథలో కలిసిపోయి కథకు నిండుతనం తెచ్చిపెట్టాయి. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన హంగులు (ఐటం సాంగ్ తప్ప) సమకూర్చిన ఈ చిత్రం చూస్తున్నంత సేపూ బోర్ కొట్టదు..సరికదా...గద్దర్, కేసీఆర్ ల పాటలతో ఉత్తేజం వస్తుంది. కొందరిని ఆలోచనలో పడేస్తుంది. అలాగే సీమాధ్ర నేతలను డైరక్ట్ గానే విమర్శలు చేస్తూ తిడితూ..చెప్పించిన డైలాగులు టప్పుట్లు కూడా కొట్టించుకుంటాయి. దర్శకుడుగా వీటిన్నటినీ బ్యాలెన్స్ చేసిన శంకర్ నిజంగా అభినందనీయుడే. అయితే ఈ చిత్రం ద్వారా కొత్తగా చెప్పింది ఏమన్నా ఉందా అంటే ..జరిగిన సంఘటనలను డాక్యుమెంటరైజ్ చెయ్యకుండా కమర్షియల్ పంధాలో ఆట, పాటలతో మనముందుంచటమే...ప్రజలను కొత్తగా ఆలోచలో పడేసే అంశాలేమీ లేకపోయినా...వాస్తవంగా జరిగిన సంఘటనలను మనముందిచంటంతో సినిమా సక్సెస్ అయ్యింది.

నటీనటుల్లో జగపతిబాబు, స్మృతి ఇరాని, శివా రెడ్డి వంటి సీనియర్లు ప్రాణం పోసారు. నిర్మాణ పరంగా నాశిగా ఉన్నా దర్శకత్వ పరంగా శంకర్ తానేమిటో మరో సారి చూపెట్టుకున్నాడు. అయితే ప్రేమ కథ మీద పెట్టిన శ్రద్ద ఉద్యమాన్ని చూపంట్టడంలో పెట్టలేదని అర్దమవుతుంది. అయితే ఎవరి లెక్కలు వారికుంటాయి కాబట్టి దాన్ని పట్టించుకోవాలసిన పనిలేదు. ఇక సంగీత పరంగా చక్రి నిలబడే ట్యూన్సే ఇచ్చాడు. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. మిగతా విభాగాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.

ఫైనల్ గా చిత్రం లో కొన్ని సంఘటనలు గత కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతుందన్న సఘంటనలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చేలా చేస్తాయి. అలాగే టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది కాబట్టి తెలంగాణా వారికి బాగా నచ్చుతుమంది. ఇక ఆ ఎమోషన్స్ తో , ఉద్యమంతో సంభంధం లేని వారికి సైతం ఓ ప్రేమ కథగా ఆకట్టుకునే అవకాశం ఉంది. టోట్ లాగ హిట్ బోలో అనిపించుకుంది.

Ala modalaimdi review[అలా మొదలైంది రివ్యూ ]


చిత్రం: అలా మొదలైంది
సంస్థ: శ్రీ రంజిత్‌ మూవీస్‌
నటీనటులు: నాని, నిత్య మీనన్‌, స్నేహ ఉల్లాల్‌, కృతి కర్బందా,
ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు.
సంగీతం: కల్యాణి మాలిక్‌
నిర్మాత: కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌
దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి

మహిళా దర్శకురాలు, అందులోనూ తొలి చిత్రం అంటే రకరకాల అంచనాలు, ఆలోచనలు అలవోకగా మదిలో మొదలైపోతాయి. అయితే ఆ అపోహలను ఒంటిచేత్తో చెదరకొట్టి, కామిడీతో అదరకొట్టి ప్రేక్షకుల నాడిని పట్టే ప్రయత్నం చేసిందీ చిత్రం. స్క్రిప్టు పరంగా చూస్తే రొమాంటిక్ కామిడీ అని మొదలుపెట్టిన ఈ చిత్రం స్క్రీన్ టైమ్ గడిచే కొలిదీ రొమాన్స్ తగ్గిపోయి, కేవలం కామిడీకే పరిమితమతవటమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే రొమాంటిక్ కామిడీ కాకపోతే కామిడి...ఏదైతే ఏంటి టిక్కెట్ డబ్బులు గిట్టుబాటు కావటానికి అని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మౌత్ టాకే ఈ చిత్రాన్ని నిలబెడుతుందనిపిస్తుంది.

గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా చూడదగ్గ కథ...కాదు కాదు..కథనం.

నిజానికి ఇలాంటి కథలు కత్తిమీద సాము లాంటివి. వీటిల్లో ప్రత్యేకమైన కథ ఉండదు. కేవలం సన్నివేశాల బలంతో, డైలాగులతో, నటీనటుల హావ భావాలతో కథనం నడవాలి. అందులోనూ ఈ తరహా చిత్రాల్లో కనపడే...కలవటం...విడిపోవటం..పొందటం అనే రొమాంటిక్ కామిడీ బీట్స్ సగటు సినిమా ప్రేక్షకుడుకి పరిచయం అయినవే. దాంతో తెరపై తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడు ఇట్టే ఊహించేస్తాడు. దాంతో ఇలాంటి కథను నెలబెట్టాలంటే...స్క్రీన్ ప్లేని ఎంత ఆసక్తికరంగా మలిచాము, ఎంత కొత్తగా చెప్పామన్నదే చివరిదాకా కూర్చోబెట్టే అంశం. ఈ విషయంలో దర్శకురాలు పూర్తిగా కాదు కానీ..దాదాపు సఫలీకృతమైనట్లే.

ఇక ఫస్టాఫ్ పూర్తయ్యి ఇంటర్వెల్ కు వచ్చేసరికే కథ ఓ కొలిక్కి వచ్చేసింది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టిన తర్వాత వేరే ఏ సమస్యా వారిద్దమరి మధ్య లేకపోవటంతో కాంఫ్లిక్ట్ లేకుండా పోయింది. దాంతో సెకెండాఫ్ ని రన్ చేయటం కోసం..అపార్ధాలు, ఫేక్ బ్యాంగ్ ల మీద ఆధారపడ్డారు. అలాగే ఇక హీరోయిన్ కి సెల్ ఫోన్ పెడితే కథ ఆగిపోతుందని పెట్టకపోవటం, కథ డిమాండ్ చేయకపోయినా కావాలని డైలీ సీరియల్ తరహా ట్విస్ట్ లు కథలోకి తీసుకురావటం, మైనస్ లు గా ఈ చిత్రంలో పంటిక్రింద రాయిలా కనపడతాయి.

అలాగే హీరో తల్లిని చంపటం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఎక్కడా కథలో డెప్త్ పెరగలేదు... కథలో చిన్న మార్పు కూడా రాలేదు. అలాగే ఆశిష్ విధ్యార్ధి పాత్ర క్లైమాక్స్ లో కామిడి చేసినా నిజానికి అదీ కథను ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళదు. ఇవన్ని ప్రక్కన పెట్టితే కథలో ఎక్కడో ప్లాంటింగ్ చేసి మరెక్కడో పే ఆప్ చేయటం(గే సీన్ వంటివి) అనే టెక్నిక్ ని చాలా చోట్ల వాడినా ఎక్కడా దొరక్కుండా మ్యానేజ్ చేయటం మాత్రం బాగా చేసారు. వీటితో పాటు టైటిల్స్ పడేటప్పుడు ఆ టెక్నీషియన్స్, ఆ ఆర్టిస్టులు చిన్నప్పటి ఫోటోలు వెయ్యటం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కామిడీనే ఈ చిత్రం సక్సెస్ కు ప్రాణమై నిలుస్తుంది.

నటీనటుల్లో నాని, నిత్య పోటీ పడిచేసారు. నిత్య నటనకన్నా నవ్వు బాగుంది. ఆ నవ్వుతో చాలా మంది ప్రేమలో పడే ప్రమాదం కూడా ఉంది. డైలాగులు కూడా ఎన్నుకున్న జెనర్ కి తగ్గట్లే పంచ్ లతో పేలాయి.అయితే కథకు సంభంధం లేని సన్నివేశాల్లోనే అవి పేలటం విచిత్రం. ఇక డైరక్షన్ పరంగా గా దర్శకురాలు నీట్ గా ప్రెజెంట్ చేసింది కానీ తనదైన ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. టెక్నికల్ గా కెమెరా వర్క్ మరింత బావుండాల్సింది. మిగతా డిపార్టమెంట్ లు ఓకే అనిపిస్తాయి. రెండు పాటలు తప్ప మిగతావి ఎక్కవు.

ఏదైమైనా ఈ చిత్రం ఓ కామిడీ గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఓ కొత్త దర్శకురాలు తడబడకుండా చేసిన ప్రయత్నాన్ని అభినందించటానికి వెళ్ళొచ్చు. ఉన్నంతలో ఆహ్లాదంగా తీయటానకి ప్రయత్నంచిన ఈ చిత్రంలో అసభ్యత, శృంగారం లేవు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళి చూసి రావచ్చు.

Mirapakay review[మిరపకాయ్ రివ్యూ ]


సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
నటీనటులు: రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు,
సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
కూర్పు: గౌతమ్ రాజు
సంగీతం: తమన్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కధ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

గతంలో "షాక్" ఇచ్చిన డైరక్టర్ తో రవితేజ మరోసారి సాహసం చేస్తున్నాడంటే...గ్యారెంటీగా స్క్రిప్టు అధ్బుతంగా ఉండి ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేయటం సహజం. అయితే అది అత్యాసే నని, రవితేజ ఎప్పటిలాగే స్క్రిప్టు ఎలాగున్నా తనదైన టిపికల్ మ్యానరిజంస్ తో, అల్లరి చేష్టలతో సినిమాను లాగించేయచ్చు అని నమ్మి ఈ చిత్రం చేసినట్లు స్పష్టమవుతుంది. షారూఖ్ ఖాన్ హిందీ చిత్రం "మైహూనా" ను ప్రక్కన పెట్టుకుని కథ అల్లుకున్నట్లున్న ఈ చిత్రం ద్వితీయార్ధం ప్రారంభం నుండి మెల్లిగా డ్రాప్ అయిపోతూ..పోతూ...క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా జారిపోయింది. హరీష్ శంకర్...మాటల రచయితగా పంచ్ డైలాగులు వేసి నవ్వించాడు కానీ కథకుడుగా రాణించలేకపోయాడు. అలాంటి స్ధితిలో సినిమాను చివరిదాకా భరించగలిగాము అంటే అది రవితేజ ఎనర్జీతో ఇచ్చిన కిక్కే అని చెప్పాలి.

ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్ కోసం మరొకరిని ప్రేమలో పడేయటమే పాయింటు రవితేజకు నచ్చి ఈ చిత్రం ఓకే చేసి ఉండవచ్చు. కానీ నిజంగా ఓ అమ్మాయిని ప్రేమలో దింపి మాఫియాడాన్ అయిన అతని తండ్రిని పట్టుకోవాలనే వింత ఆలోచన ప్రపంచంలో ఏ ఇంటిలిజెన్స్ డిపార్టమెంట్ అయినా చేస్తుందా...చేయాలనుకున్నా ప్రేమలో దింపటమెందుకు...దొరికిన అమ్మాయిని ఏ కిడ్నాపో మరొకటో చేసి ఆమె తండ్రిని పట్టుకోవచ్చుకదా అని ఈ చిత్రం చూస్తున్నంతసేపూ తొలుస్తుంది. అలాగే విలన్(ప్రకాష్ రాజ్) పాత్ర ఎక్కడో క్లైమాక్స్ దాకా కథలోకి రాదు. అతన్నిహీరో చంపితే బాగుండును, అతను దుర్మార్గుడు కదా అనే ఆలోచన మనకు పొరపాటున కూడా కలగదు. దాంతో హీరో అతన్ని చంపుతూంటే హీరో ఎందుకిలా చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. దానికితోడు తన కూతురుని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారనే విషయం ఆ ఇంటర్నేషనల్ డాన్ కి క్లైమాక్స్ దాకా కూడా తెలియదు. దాంతో అతను హీరోని పట్టించుకోడు. హీరో కూడా క్లైమాక్స్ దాకా అతని జోలికి వెళ్లడు. దాంతో అస్సలు సినిమా ఎటుపోతుందో చూసేవారికి అర్దం కాదు.

మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో డైలాగులు బావున్నాయి. అయితే డైలాగులతోనే సినిమా మొత్తం నడిపేయటం నచ్చదు. అలాగే దర్శకుడుగా షాక్ నాటి షార్ప్ నెస్ ఎందుకనో చిత్రంలో మిస్సైందనిపిస్తుంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు. కోట, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కొన్ని వందల సార్లుచేసిన పాత్రే చూస్తున్నాం అనిపిస్తుంది. పాటల్లో రెండు బాగున్నాయి..ధియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.

ఏదైమైనా ఇది రవితేజ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్సై వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాస్సేపు నవ్వుకుందామని వెళ్తే అల్లరి నరేష్ సినిమాలా ఎంటర్టైన్ చేస్తుంది.అ దే మంచి మాస్ మసాలా సినిమా చూద్దామనుకుంటే మాత్రం నిరాశపరుస్తుంది. మిరపకాయ్...ఘాటు ఉంటుందని మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.

parama veera chakra review[పరమ వీర చక్ర రివ్యూ]



బ్యానర్: తేజ సినిమా
నటీనటులు: బాలకృష్ణ, అమీషా పటేల్‌, షీలా, నేహా ధూపియా, రాజ్‌ ప్రేమి, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌,
విజయ్‌ కుమార్‌, చలపతిరావు, అశోక్ ‌కుమార్‌, బ్రహ్మానందం, అలీ, హేమ, రఘుబాబు, కృష్ణభగవాన్‌ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రమణ రాజు
ఎడిటింగ్: గౌతమ్ రాజు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: సి.కల్యాణ్‌
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దాసరి నారాయణరావు
తేది: 12/01/2011

"యంగ్ ఇండియా" వంటి డిజాస్టర్ సినిమా తీసి ఈ మధ్య కాలంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపిన దాసరి తన తదుపరి చిత్రానికి బాలకృష్ణను హీరోగా ఎంపికచేసుకున్నాడనగానే అంతటా అంచనాలు కన్నా అనుమాలు ఎక్కువ మొదలయ్యాయి. అయితే సింహా ఇచ్చిన కిక్ తో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటాడని, దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ క(ఇ)ష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.

ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి(జయసుధ)కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

బాలకృష్ణ చేత ఈ చిత్రం బొబ్బిలిపులికి సీక్వెల్ కాదు...రీమేక్ అంతకన్నా కాదు అని ప్రత్యేకంగా ఇంటర్వూల్లో చెప్పించిన దాసరి ఈ చిత్రాన్ని బొబ్బిలిపులి సీన్ తోనే మొదలెడతారు. అలాగే మేజర్ జయసింహ కథంతా విన్న హీరో చక్రధర్ కి ఊహించని విధంగా ఏదో ట్విస్ట్ వస్తుందని ఎన్నో సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడు ఎదురుస్తాడు. అయితే వారి ఊహకు అందనిరీతిలో అంతసీనెందుకు అన్నట్లుగా రొటీన్ గానే కథనం సా...గు..తూంటుంది. కొన్ని సార్లు చాలా మందికి విజయేంద్రవర్మ చిత్రం కూడా గుర్తుకు వచ్చి ఆ ప్లాపుకి కనెక్టు అయిపోయారు.

సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.ఎప్పటికో మురళిమోహన్ చెప్పే ప్లాష్ బ్యాక్ పూర్తి కావాలి, అప్పుడు గానీ మన హీరో చక్రధర్ చలనంలోకి వచ్చి విలన్స్ పనిపట్టడు. అప్పటివరకూ మనకెంత ఓపికకావాలి. అప్పటివరకూ ప్లాష్ బ్యాక్ లో కనపించే జయసింహకు సమస్యలు రావా అంటే కథ ప్రకారం చక్రధర్ కి సమస్య వచ్చి వాటిని ఫేస్ చేస్తేనే కదా కథనం రక్తి కట్టేది. ఇంతకు మించి రొటీన్ గా సాగే ఈ కథ, కథనాలను విశ్లేషించటానికి కూడాఏమీ లేదు.

అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా(అప్పట్లో) దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా...వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.

ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే...అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బావున్నాయి. అలీ, బ్రహ్మానందం చేసిన రోబో పేరడీ కామెడీ ఏ సి సెంటర్ల వారకన్నా ఎక్కాలేమో కానీ మిగతావారికి కష్టం. అదే దాసరి టార్గెట్ అయితే అంతవరకూ విజయం సాధించినట్లే. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, మురళి మోహన్, జయసుధ, రఘుబాబు వంటివారుకి పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు. చాంతాడంత డైలాగులకు దాసరి నారాయణ రావు పెట్టింది పేరనే విషయం మరో మారు గుర్తుకు వస్తుంది. అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.

పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.

Rangadi donga review[రంగ ది దొంగ రివ్యూ]


బ్యానర్: గాడ్ ఫాదర్ ఫిలింస్ తారాగణం: శ్రీకాంత్, విమల రామన్, రమ్యకృష్ణ, శివాజీరాజా, తిరుపతి ప్రకాష్, సుధాకర్(జి.వి), జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, చలపతిరావు తదితరులు... కధ: సుధాకర్ (జి.వి) మాటలు: సుధాకర్ (జి.వి) ఎడిటింగ్: గౌతమ్ రాజు ఆర్ట్: బంగార్రాజు సంగీతం: చక్రి నిర్మాత: సి.ఆర్.మనోహర్ దర్శకుడు: సుధాకర్ (జి.వి) విడుదల తేది: 30/12/2010

అనంతపురం జిల్లాలో ఉన్న పులిచర్లలో ఒక ఫ్యాక్షనిస్టు చేసే అరాచకాలకు సింహపురిలోని ఒక వ్యక్తి ప్రజల తరపున తిరగడతాడు. తిరగబడినతన్ని ఫ్యాక్షనిస్టు చంపితే విదేశాల్లో ఉన్న అతని కొడుకు తండ్రి బాధ్యతని చేపడతాడు. గర్భవతి అయిన అతని భార్య ఇది ఇష్టం లేక పదేళ్ళ కొడుకుతో పాటు పుట్టింటికి వెళ్ళబోతే నా కొడుకు భానుప్రసాద్(శ్రీకాంత్) ఇక్కడే ఉండి, నా తండ్రి ఆశయాలను సాధిస్తాడు. నీ కడుపులో పెరుగుతున్న వాణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో అంటాడు భర్త. ఇలా ఆమె పుట్టింటికి వెళుతుండగా ఆమెపై దాడి జరుగుతుంది. ఆ దాడి నుండి పారిపోతూండగా నెప్పులు వచ్చి ఒక మగబిడ్డను కని తన పక్కనున్నమనిషి(తెలంగాణాశకుంతల)కి ఇచ్చి మనిషిలా పెంచమని కన్నుమూస్తుంది. ఆ బిడ్దను తీసుకుని హైదరాబాద్ లోని స్టువర్ట్ కాలనీకి వెళ్తుంది ఆ మనిషి(తెలంగాణాశకుంతల). అక్కడ ఆ పిల్లాడు రంగ (శ్రీకాంత్)దొంగగా మారతాడు. పోలీసుల అరాచకాలు చిన్నప్పుడు చూసిన ఆ రంగ అచ్చంగా పోలీసుల ఇళ్ళలోనే దొంగతనాలు చేస్తుంటాడు. అతను ఒక నేరం మీద కోర్టుకి వెళ్ళగా అక్కడ అతని మీద బాంబుదాడి జరుగుతుంది. ఆ దాడిలో అతను చనిపోతాడు. అతనే భానుప్రసాద్. అతను అచ్చం తనలానే ఉండటంతో రంగ ఆశ్చర్యపోతాడు. భానుప్రసాద్ మనుషులు రంగను సింహపురి తీసుకెళ్ళి భాను ప్రసాద్ భార్య (రమ్యకృష్ణ)ముందుంచుతారు. ఆమె రంగను భాను ప్రసాద్ గా నటింపజేస్తుంది. రంగ ద్వారా తన భర్త ఆశయాల సాధనకు ఆమె కృషి చేస్తుంది. రంగ తన అన్న ఆశయాలను సాధించాడా లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.

దర్శకత్వం గురించి చెప్పాలంటే జివి గతంలో దర్శకత్వం వహించిన హీరో చిత్రం కంటే ఇది బెటరనిపిస్తుంది. సినిమా కథ మంచిదే కానీ కథనంలోని కొన్ని లోపాల వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గిస్తుంది. కథనం బాగుండి ఉండుంటే ఇది సూపర్ హిట్‍ చిత్రం అయ్యుండేది. కథలోని మలుపులు బాగున్నాయి. సినిమా తొలి సగం అంతా ఎంటర్ టైన్ మెంట్ మీద సాగి సెకండ్ హాఫ్ లో కథలోకి ప్రవేశిస్తుంది. ఫ్యాక్షన్ సినిమాల కోవలో ఇది మరొక సినిమాగా చేరింది. నిర్మాత ఖర్చుకి ఎక్కదా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణపు విలువలు కూడా బాగా ఉన్నాయి ఈసినిమాలో.


ఇక ఈసినిమాలో నటన విషయానికి వస్తే శ్రీకాంత్ రంగ ది దొంగగా, భాను ప్రసాద్ గా, మళ్ళీ భాను ప్రసాద్ గా నటించే రంగగా మూడు వేరియేషన్లను చక్కగా చూపించారు. విమలా రామన్ కు నటించే అవకాశం అంతగా లేని గ్లామరస్ పాత్ర. భాను ప్రసాద్ భార్య గా రమ్యకృష్ణ చక్కని నటన ప్రదర్శించింది. ఆమె కళ్ళతోనే తన భావాలను పలికించిన తీరు బాగుంది. తెలంగాణా శకుంతల లిమిటెడ్ గా నటించి ఆకట్టుకుంటుంది. శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డిల నటన ఆద్యం చాలా బాగుందనిపిస్తుంది.
సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు మాత్రమ బాగున్నాయి. మిగిలిన ట్యూన్లన్నీ ఏక్కడో విన్నట్టుగానే ఉన్నాయి. రి-రికార్డింగ్ బాగుంది.
ఈసినిమాలోని మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. ఓపెనింగ్ సాంగ్ లో మాత్రం కొంచెం ద్వందార్థాలు ఎక్కువైనట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, యాక్షన్ సీన్లలో ఫొటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. డాన్స్ విషాయనికి వస్తే ఈ చిత్రంలోని అన్ని పాటల్లో కొరియోగ్రఫీలో కొత్తదనం చూపించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్ని వేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండి బాగున్నాయి.

చివరగా ఎవరికైతే ఫ్యాక్షన్ సినిమాలంటే బాగా ఇష్ట పడతారో వారికి మాత్రం ఈసినిమా బాగుందని పిస్తుంది.