Friday, May 20, 2011

Veera review[వీర రివ్యూ ]


బ్యానర్ : శాన్వి ప్రొడక్షన్స్
Rating :
2.25/5

డుదలయిన తేది
: ంఅయ్ 20, 2011



శ్యామ్( "కిక్"శ్యామ్) చాలా నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్. ధనరాజ్ కొడుకు కాలేజీలో అమ్మాయిలను ఏడిపిస్తూంటే అతన్ని కఠినంగా శిక్షిస్తాడు శ్యామ్. అప్పుడు పొరపాటున ధనరాజ్ చేతిలో అతని కొడుకు మరణిస్తాడు. దాంతో శ్యామ్ మీద ధనరాజ్ పగబడతాడు. తన కొడుకు చనిపోయినందుకు ప్రతిగా శ్యాం కొడుకు మోక్షను కిడ్నాప్ చేయిస్తాడు ధనరాజ్. శ్యామ్ తన కొడుకుని రక్షించటానికి ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోతాడు. ధనరాజ్ మోక్షని చంపేస్తాడు. శతృవుల బారి నుంచి శ్యామ్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దేవా(అజయ్) అనే బాడీ గార్డుని నియమిస్తుంది. కానీ దేవ స్థానంలో వీర (రవితేజ) అనే తెలివైన సాహసవంతుడు వస్తాడు. వీర మంచి మనసున్న వ్యక్తి. శతృవులకు అతనంటే సింహస్వప్నం. శ్యాం కుటుంబాన్ని వీర కాపాడుతూంటాడు. ఐక్యతో వీర కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అసలు బాడీ గార్డ్ వీర కాదు....దేవా స్థానంలో వీరా వచ్చాడని తెలుసుకున్న శ్యామ్ అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటాడు. ఆ సమయంలో చనిపోయాడనుకున్న శ్యామ్ కొడుకు మోక్షను వీరా శ్యామ్ కుటుంబానికి చూపిస్తాడు. అప్పుడు శ్యామ్ ఏం చేశాడు...? దేవా స్థానంలో వీరా ఎందుకొచ్చాడు....? అసలు వీరా గతమేంటి....? శ్యామ్ కుటుంబానికి వీరాకీ సంబంధం ఏమిటి...? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే "వీర" సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :


విశ్లేషణ -
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాలో టేకింగ్ కి ఇచ్చిన ప్రాథాన్యత స్క్రీన్ ప్లే కి ఇచ్చివుంటే బాగుండేది. దర్శకత్వం పరంగా చూస్తే సినిమా గ్రాఫ్ పడుతూ లేస్తూ నానా అగచాట్లూ పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు మనస్సుకు హత్తుకునేలా ఉన్నా, ఆ సీన్ల ప్రభావం అలా నిలబడిపోయేలా, ప్రేక్షకులను సినిమాలోకి లీనమయ్యేలా చేయటంలో దర్శకుడి వైఫల్యం కనపడుతుంది.
ఉదాహరణకు శ్రీదేవి కొడుకుని చూడటానికి తాపత్రయపడే సీన్, సుబ్బరాజు కారులో వెళ్తూ తల్లీ కొడుకుల మీద బురద జల్లే సీన్. ఆ తర్వాత రవితేజ అతనికి బుద్ధి చెప్పే సీన్, రవితేజ తమ ఆస్తంతా తమ చెల్లి పేరు మీద మార్చి ఆ దస్తావేజులు పిన్నికిచ్చే సీన్ ఇలాంటి సీన్లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి...కానీ ఆ తర్వాత వచ్చే సీన్లు వాటి ప్రభావాన్ని నిలబెట్టి ఉంటే సినిమా బాగుండేది. రవితేజను పెళ్ళి చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రేమ కలిగే వరకూ శోభనానికి అంగీకరించననటం కూడా ఫుట్టేజ్ పెంచటం కోసం తప్పితే సినిమాకి ఉపయోగ పడిందేం లేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - రవితేజ ప్రతి సినిమాలోలా తన సహజ శైలిలో ఫుల్ జోష్ తో నటించాడు. అలాగే కాజల్ అగర్వాల్, తాప్సి, శ్యామ్, శ్రీదేవి, నాజర్, రోజా ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం, వేణు మాధవ్ ల కామెడీ ఈ సినిమాలో ఎందుకనో ఆశించిన స్థాయిలో పండలేదు.వీళ్ళకంటే ఆలీ కాస్త బెటరనిపించాడు.
సంగీతం -
పాటలన్నీ ఫరవాలేదు. రీ-రికార్డింగ్ కూడా బాగానే ఉంది.

సినిమాటోగ్రఫీ -
బాగుంది.

మాటలు -
ఈ సినిమాకు అబ్బూరి రవి రచన, మరో ముగ్గురు రచనా సహకారం చేస్తే, మరి పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి ఏం చేశారో, ఏం రాశారో అర్థం కాదు. అయినా ఈ సినిమాలోని మాటలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

పాటలు -
పాటల్లో సాహిత్యం ఓ మోస్తరుగా ఉంది.

ఎడిటింగ్ - సగటు స్థాయిలోనే ఉంది. కారణం గౌతం రాజుగారు బహుశా వాళ్ళమ్మాయి పెళ్ళి పనుల్లో బిజీగా ఉండి ఉంటారు.
ఆర్ట్ -
బాగుంది.

కొరియోగ్రఫీ -
యావరేజ్ గా ఉంది.

యాక్షన్ -
ఇది మాస్ ప్రేక్షకులకు కావలసినంతగా నచ్చే స్థాయిలో ఉంది.

Sunday, May 15, 2011

రంగం రివ్యూ [rangam review]


'డిష్యుం డిష్యుం', 'ఈ' వంటి చిత్రాల కంటే ఆర్.బి.చౌదరి కుమారుడిగానే తెలుగువారికి పరిచయం ఉన్న జీవా మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 'రంగం' సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్.యస్.ఇన్ఫో టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె.వి ఆనంద్ దర్శకత్వం వహించారు. జీవా సరసన నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా నటించింది. ప్రియ బాజ్ పాయి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్ రావు తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జై రాజ్ స్వరాలను సమకూర్చగా వెన్నెలకంటి సాహిత్యాన్ని అందించారు. రిచర్డ్.యం.నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా అంటోనీ ఎడిటింగ్ నిర్వహించారు. ఇప్పటికే 'కో' పేరుతొ తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటుందో మన సమీక్షలో చూద్దాం.
కధ:
అశ్వద్ (జీవా) నేటి పత్రిక అనే దినపత్రిక కోసం పనిచేసే ఫోటో జర్నలిస్ట్. ఎప్పుడూ సంచలన వార్తలతో నేటిపత్రిక సర్కులేషన్ను పెంచుతూ ఉంటాడు. అదే క్రమంలో తన సంచలన కధనాలతో చిన్న పిల్లను పెళ్ళి చేసుకోవాలనుకున్న ప్రతిపక్ష నాయకుడు భండారాన్ని బయటపెట్టి జైలుకు పంపిస్తాడు. అలానే తనతో పాటు పనిచేస్తున్న సరో(ప్రియ బాజ్ పయి), ప్రియ(కార్తిక) లలో సరోని కాదని ప్రియను ప్రేమిస్తాడు అశ్వద్. మరో వైపు ప్రతిపక్ష లీడర్ జైలుకు వెళ్ళడంతో గెలుపు మీద ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి(ప్రకాష్ రాజ్)ని కూడా తప్పు చేసినందుకు ఒకానొక సమయంలో ప్రజల ముందు దోషిగా నిలబెడతాడు అశ్వద్. ఈ సమయంలోనే వసంత్ అనే యువలీడర్ యువరాజ్యం పార్టి పెట్టి ఎన్నికలలో నిలబడతాడు. అతను చేస్తున్న మంచిపనులకు అశ్వద్ కూడా మద్దతు ప్రకటించి మంచి కధనాలు పత్రికలో వచ్చేట్టు చూస్తాడు. ఆ విధంగా జనంలో మంచి పలికుబడి పెంచుకుంటున్న వసంత్ నిర్వహిస్తున్న మీటింగులో బాంబు పేలి 30 మంది వరుకు అతని కార్యకర్తలు చనిపోతారు. ఆ ప్రమాదంలో సరో కూడా చనిపోతుంది. ఆ విషాదాన్ని చూసి జనాలు వసంత్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారు. వసంత్ విజయం గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ తయారుచేసే పనిలో ఉన్న అశ్వద్ కు సరో ప్రమాదంలో చనిపోలేదు ఎవరో చంపేసారు అని తెలుస్తుంది. ఇక అక్కడినుండి కధ ఆసక్తి కరమైన మలుపులు తిరిగి అర్ధవంతమైన ముగింపుతో సుఖాంతమవుతుంది.
విశ్లేషణ:
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రంగం మీడియా వీరంగం. ప్రెస్ తలచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలదు, అవసరం అయితే నిలబెట్టగలదు అనే విషయాన్నీ నిరుపించడమే ప్రధాన లక్ష్యం గా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు కె వి ఆనంద్. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆనంద్ తన అనుభవాలకు మంచి ఆలోచనలు జోడించి 'రంగం' సినిమాను రూపొందించాడు. కాకపోతే యువత రాజకీయాల్లోకి రావటానికి అయన నిర్దేశించిన మార్గాలు సినిమాటిక్ కోణంలో వాస్తవానికి దూరంగా ఉన్నాయి. సినిమా అనేది ఊహలలో నుండి, కల్పన నుండి పుట్టేది కాబట్టి అయన ప్రయత్నం మేచ్చుకోతగిందే. అలాగే చివరకు ఆయన కధను ముగించిన విధానం బాగుంది. కధ కధనాలు పక్కన పెడితే సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. పీటర్ హెయిన్స్ పోరాటాలు, బృంద మాస్టర్ తదితరులు వేయించిన డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారిస్ జై రాజ్ స్వరపరచిన పాటలు వినటానికి ఎంత బాగున్నాయో చూడటానికి అంతకంటే బాగున్నాయి. జీవా అశ్వద్ పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించాడు. నటనలో, డాన్సుల్లో, ఫైటుల్లో ఇజ్ కనబరిచి తనదైన శైలిలో రక్తికట్టించాడు. జోష్ తరవాత ఏమైపోయిందో అడ్రెస్ లేని కార్తీక ఈ సినిమాలో మంచి పాత్రలో నటించింది. కాకపోతే నటనలో ఇంకాస్త పరిణితి ప్రదర్శించి ఉంటే బాగుండేది. కోట శ్రీనివాస్ రావు, ప్రకాశ రాజ్ తమ పాత్రలకు అనుగుణంగా వారి సహజ ధోరణిలో నటించారు. మిగిలిన పాత్రలలో నటించిన వారు మనకు అంతగా పరిచయం లేని వారు. కానీ వసంత్ పాత్రలో నటించిన అజ్మల్ మంచి మార్కులు వేయించుకుంటాడు.
ప్లస్ పాయింట్స్:
రంగం సినిమాకు దర్శకత్వం ప్రధాన ప్లస్ పాయింట్. ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యం, జీవా నటన కూడా ప్లస్ పాయింట్సే ఈ చిత్రానికి . అలాగే హారిస్ జై రాజ్ పాటలు వాటిని చిత్రీకరించిన విధానం అదనపు ఆకర్షణ. మరీ ముఖ్యంగా 'నెమలి నడకలు .. ' పాటను చిత్రకరించిన ప్రదేశాలు కన్నుల పండవగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
రొటీన్ గా అనిపించే కధనం, కామెడీ లేక పోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్స్.

కొసమెరుపు:
రంగం వీరంగం... వీరంగంగానే ఉంది కానీ ఫార్ముల సినిమాలు, స్టార్ ఇమేజ్ కు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఎంత వరుకు నచ్చుతుందో వేచి చూడాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా చివరికి కలక్షన్లే కదా సినిమా విజయానికి ప్రాతిపదిక ...!

సీమ టపాకాయ్ రివ్యూ [seema tapakay review]


వరస విజయాలతో మంచి ఊపు మీదున్న అల్లరి నరేష్ వేసవి కానుకగా 'సీమ టపాకాయ్' సినిమాతో ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెల్ఫేర్ క్రియేషన్స్ ఫై డా. మళ్ళ విజయ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి నాగేశ్వర రెడ్డి దర్శకుడు. నరేష్ సరసన పూర్ణ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, షాయాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరుధూరి రాజా మాటలను అందించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించాడు. నరేష్ తరహ కధ, కధనాలతో రూపొందించిన ఈ కామెడీ టపాకాయ్ ప్రేక్షకులను ఎంతవరుకు మెప్పించిందో మన సమీక్షలో చూద్దాం.
కధ:
ఇరవై వేల కోట్ల రూపాయల సంపాదన కలిగిన కోటిస్వరుడి కుమారుడు శ్రీకృష్ణ (అల్లరి నరేష్). అతను సత్య (పూర్ణ)అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు కోటిస్వరులంటే పడదు. అందుకని ఆమెను ప్రేమించడానికి తను పేద వాడినని చెప్పి తన కుటుంబం మొత్తం చేత పేద వాళ్ళలా యాక్ట్ చేపిస్తాడు. కానీ పిచ్చి శ్రీకృష్ణ కు సత్య బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియదు. ఆ బ్యాక్ గ్రౌండ్ మూలంగా అతను, అతని ఫ్యామిలీ అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. ఇక అక్కడి నుండి శ్రీకృష్ణ ఆ చిక్కులను చాకచక్యంగా ఎలా విడదీసి కధను సుఖాంతం చేసాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
అన్ని అల్లరి నరేష్ సినిమాలు లాగానే ఈ సినిమా కూడా నవ్వించడం అనే సిద్దాతంతోనే రూపొందింది. ఆ విషయం లో దర్శకుడు నాగేశ్వర రెడ్డి కొంతవరుకు విజయం సాదించినట్టే. ఒకే పాయింట్ ను ఆధారంగా చేసుకుని చేసిన ఈ సినిమా మొదట్లో బాగానే ఉందనిపించి నా చివరికి వచ్చేప్పటికి రొటీన్ గా తయారై కాస్త బోర్ కొడుతుంది. సన్నివేశాలు, పాత్రల రూపకల్పనలో స్పష్టతలోపించింది. అన్నింటికంటే భాదాకరమైన విషయం ఏమిటింటే మద్యలో ఉన్నట్టుండి సినిమా సెంటిమెంట్ వైపు తిరగి దాదాపు 15 నిమిషాలపాటు గ్లిజరిన్ వర్షం కురుస్తుంది. జయప్రకాశ్ రెడ్డి ఉన్న సన్నివేశాలు, ఈ మద్య వచ్చిన హిట్ పాటల పేరడీ ప్రేక్షకులకు కాస్త ఊరట.అల్లరి నరేష్ తన సహజ ధోరణిలో రెచ్చిపోయాడు. నటుడిగా పూర్తి విశ్వాసంతో కనపడుతున్నాడు. పొడవాటి డైలాగులను కూడా అవలీలగా చెప్పేస్తున్నాడు. కొత్త అమ్మాయి పూర్ణ బాగానే చేసింది. కాకపోతే ఆమె క్యారేక్తరైజేషన్ సరిగా లేదు. కొన్ని సన్నివేశాలలో అసిన్ ను గుర్తుకు తెస్తుంది. షాయాజీ షిండే నటన బాగుంది. నాగినీడు, యల్.బి.శ్రీరామ్ తదితరులు వారి పరిది మేర నటించారు. బ్రహ్మానందం మాటలు అప్పుడప్పుడు నవ్విస్తాయి. వందేమాతరం పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. మరుధూరి రాజా మాటలు ఓకే.

ప్లస్ పాయింట్స్:
మొదటి సగంలో కొన్ని కామెడీ సన్నివేశాలు.
అల్లరి నరేష్ నటన.
రెండు పాటలు(ఆకాశంలో ఒక తార.., కంది చేను..)

మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే రెండో సగం,
విసుగు తెప్పించే కొన్ని కామెడీ సన్నివేశాలు.

కొసమెరుపు: ఈ సీమ టపాకాయ్ లో మెరుపులు, మోతలు అనుకున్నంత లేవు అని ప్రేక్షకుల టాక్.

Saturday, May 7, 2011

100%Love Review[100%లవ్ రివ్యూ ]


సంస్థ: గీతా ఆర్ట్స్‌
నటీనటులు: నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు.

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: సుకుమార్‌

పరిచయ చిత్రం జోష్ ప్లాప్..ఆ తర్వాత వచ్చిన ఏ మాయ చేసావే సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం సమంతకు కొట్టేసింది. దాంతో నాగచైతన్య తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో ప్రక్క జగడం, ఆర్య 2 చిత్రాలు దర్సకుడుగా పేరు తెచ్చిపెట్టినా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో దర్శకుడు సుకుమార్ కూడా కమర్షియల్ హిట్ కోసం కలవరిస్తూ ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడు. అలాగే తమన్నా కూడా హ్యాపీ డేస్ తర్వాత తెలుగులో ఆమె స్ట్రైయిట్ గా ఏ చిత్రమూ చేయలేదు. దాంతో రీ ఎంట్రీ క్రింద ఈ చిత్రం హిట్ వైపు ఆమె ఎదురుచూపులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వారి ఆశలు, నమ్మకాలు, ఎదురుచూపులు ఈ చిత్రం ఏ మేరకు నెరవేర్చింది..ఎవరు ఎన్ని మార్కులు స్కోర్ చేసారు అంటే...
మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే. కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని ఈ సారి తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడాడు. అలాగే తన స్పెషలైజేషన్ అయిన క్యారెక్టర్ డ్రైవన్ ఫిల్మ్ గానూ మరో ప్రక్క ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆయన అభిమానులును సంతృప్తి పరిచాడు. ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ వద్ద నాగచైతన్య బరస్ట్ అయ్యి తన ప్రేమను వ్యక్తం చేసే సీన్ చాలా బాగా వచ్చింది. హీరో తాతగా చేసిన విజయ్ కుమార్ పాత్ర బాగా కథలో కలిసి క్లైమాక్స్ కు లీడ్ చేయటం చాలా బాగా వచ్చింది. ఆయన పాత్ర కథలో కీలకమవ్వటం సుకుమార్ స్క్రిప్టుపై చేసిన కసరత్తు ఫలితమే అనిపిస్తుంది. అంతేగాక హీరో పాత్ర చివరదాకా తన క్యారెక్టేరషన్ ని వదలకుండా నిలబెట్టడం కూడా బాగా నచ్చే అంశం. నటీనటుల్లో నాగచైతన్య..ఈజ్ బాగా ప్రదర్శించాడు.అయితే చైతన్య కన్నా తమన్నా డామినేట్ చేసిందని చెప్పాలి. సినిమా చూసిన తర్వాత ఆమె మీద టైటిల్ పెట్టి దటీజ్ మహాలక్ష్మి అంటే జస్టిఫై అయ్యేది అనిపిస్తుంది. మిగతా సీనియర్ ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. కెమెరా పనితనం రెగ్యులర్ సుకుమార్ లాగానే చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పుగా ఉంది. దర్శకుడుగా సుకుమార్ ఈ సినిమాలో విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పాలి. పాటల విషయానికి వస్తే సుకుమార్ గత చిత్రాల ఆడియోతో పోలిస్తే వీకే అని చెప్పాలి. ముఖ్యంగా ఐటం సాంగ్ అసలు పేలలేదు. ఇక ఈ మధ్య కాలంలో రిలీజైన తీన్ మార్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకీ ఈ సినిమాకి ఓ పెద్ద పోలిక ఉంది. అది సినిమాలో హీరో తనదైన భావాలతో ఎదుటివారు ప్రపచం పట్టించుకోకుండా నెగిటివ్ షేడ్ తో ఉండటం..సినిమా చివరకి హీరోయిన్ మంచితనం,ప్రేమ గుర్తించి ఆమె రూటులోకి రావటం. ఇక ఈ సమ్మర్ లో ఈ సినిమా వేసవి సెలవుల్లో ఉన్న స్టూడెంట్స్ కు మంచి వినోదాన్ని ఇస్తుంది. ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చే అవకాశం ఉంది.

Friday, April 29, 2011

Nenu na Rakshasi review[నేను నా రాక్షసి రివ్యూ ]


నేను నా రాక్షసి బ్యానర్ : శ్రీ లక్ష్మి నరసింహ ప్రోడుక్షన్స్ Rating : 2.25/5 విడుదలయిన తేది : Apr 29, 2011 నిర్మాత - నల్లమలపు శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - పూరీ జగన్నాథ్ సంగీతం - విశ్వ, రెహమాన్, అనూప్ సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్ పాటలు - విశ్వ, రెహమాన్, భాస్కరభట్ల రవికుమార్ ఎడిటింగ్ - శేఖర్ కొరియోగ్రఫీ - రాజు సుందరం, ఆంథోనీ తారాగణం - రానా దగ్గుపాటి, ఇలియానా .డి. క్రూజ్, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, నాగినీడు, ఆలీ, ఆహుతి ప్రసాద్, ముమైత్ ఖాన్ తదితరులు...

కథ - ఒక సమస్య ఎంత తీవ్రమైనదైనా, ఎంత చిన్నదైనా, ఆ సమస్యకి ఆత్మహత్యా పరిష్కారం...? అన్న ప్రశ్నకి సమాధానమే ఈ చిత్రకథ. ఇక కథ విషయానికొస్తే అభిమన్యు (రానా) ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అతను రైఫిల్ షూటింగ్ లో ఎక్స్ పర్ట్. మీనాక్షి (ఇలియానా) ఒక కాఫీబార్ లో పనిచేస్తూంటుంది. మీనాక్షి ఒక వెబ్ సైట్ రన్ చేస్తూంటుంది. ఆమెను చూడగానే అభిమన్యు ప్రేమిస్తాడు. ఆత్మహత్య చేసుకోదలచిన వారు ఆ వెబ్ సైట్ ను కాంటాక్ట్ చేస్తే, ఇలియానా వారి చావుని వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతుంది. సుపారీ (చంపటానికి తీసుకునే కిరాయి) తీసుకుని అమ్మాయిలను ఏడిపించే కుర్రాణ్ణి ఒకణ్ణి చంపుతాడు అభి. విక్రం (సుబ్బరాజు) అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఏడేళ్ళ కూతురుకి క్యాన్సర్. ఆమెను చమపమని ఆ కుర్రాడి తండ్రి అభిమన్యుకి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ పసిపిల్ల అభికి మంచి ఫ్రెండ్. దాంతో అభి ఆ కుర్రాడి తండ్రిని కూడా చంపేస్తాడు. కోమాలో ఉన్న అభి తల్లి కూడా చనిపోవటంతో అభి తాను కూడా చావాలనుకుంటాడు. అందుకు మీనాక్షి వెబ్ సైట్ ని కాంటాక్ట్ చేస్తాడు. కానీ పొడుచుకుని చనిపోయే సమయంలో తన చావుని విడియో తీస్తుంది తను ప్రేమించిన అమ్మాయేనని తెలుసుకుని బ్రతకాలనుకుంటాడు అభి. అభి చంపిన ఆ తండ్రి పెద్ద కొడుకు జైలు నుండి బయటకొస్తాడు. అతనే అభి తల్లిదండ్రుల చావుకి కారకుడు. అతను అభిని చంపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆత్మహత్యల వెబ్ సైట్ నడుపుతున్న మీనాక్షిని చివరికి పోలీసులు ట్రేస్ చేస్తారు. అప్పుడు అభి, మీనాక్షి కలసి వెనిస్ వెళ్తారు. తనను గాఢంగా ప్రేస్తున్నానన్న అభితో తాను కూడా ఓ పదిహేను రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానంటుంది మీనాక్షి. ఆ తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ.

ఎనాలసిస్ : ఈ సినిమా భయంకరమైన డ్రై సబ్జెక్ట్. ముందు ఇలాంటి కథతో సినిమా తీయాలనుకున్న దర్శక, నిర్మాతలకు హేట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే హీరో, హీరోయిన్లు ఇద్దరికీ డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ వల్ల సూయిసైడల్ టెండెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి కథలను మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో తెలియదు. విభిన్నమైన కథలతో సినిమాలు రావాలి అంటూ గోలపెట్టే వారికి ఈ సినిమాలో విభిన్నత గోచరిస్తుంది. కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ ని క్యారీ చేయటంలో దర్శకుడి అసమర్థత మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పూరీ జగన్నాథ్ ( మైండ్ యూ పీప్యుల్ ఈ సినిమా వరకూ మాత్రమే నేను దర్శకుడు అసమర్థుడన్నది) దర్శకుడిగా టెకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ కథలోని సోల్ ఎక్కడో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటన విషయానికొస్తే... హీరోగా రానా తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. అతను డ్యాన్స్ లో కాస్త వెనకపడ్డట్టనిపించాడు. కానీ దాన్ని దర్శకుడు పూరీ చాలా జాగ్రత్తగా కవర్ చేశాడు. చక్కని ధవళ గాత్రంతో రానా డైలాగ్స్ చెప్పినా, భాష విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఇలియానా నటనలో మమచి కసి కనిపించింది. కానీ ఆమె పాత్రలో పరిపక్వత లేకపోవటం వలన ఆమె నటనకు రావలసిన గుర్తింపు రాదేమోననిపిస్తుంది. కమెడియన్ గా ఆలీకి వంక పెట్టేదెవరు....? ముమైత్ ఖాన్ ఈ చిత్రంలో మామూలుగా తను నటించే పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించటం విశేషం. అభిమన్యు సింగ్ కన్నా బాగా నటించే నటులు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మందే ఉంటారు. కాని వెతికే ఓపిక మన వాళ్ళకి ఎక్కడిది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.

సంగీతం -ఈ చిత్రంలో అద్భుతం అనిపించక పోయినా వినటానికి పాటలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ -జిగ్ జాగ్ షాట్లతో కళ్ళకి శ్రమ కలిగించకుండా ఉండి బాగుంది.

మాటలు - పూరీ జగన్నాథ్ మాటల్లో అక్కడక్కడ "పోకిరి" పోలికలు కనిపించినా, ఆ స్థాయిలో ఈ చిత్రంలోని డైలాగులు లేవనే చెప్పాలి. పాటలు -
ఈ సినిమాలోని పాటల్లో సాహిత్యం బాగానే ఉంది. ఒక పాటలో "బంగారానికి బంధువా-నా దాహం తీర్చే బిందువా" వంటి ప్రయోగాలు సాహిత్య పరంగా బాగున్నాయి.
ఎడిటింగ్ -బాగుంది. ఆర్ట్ -ఒ.కె. కొరియోగ్రఫీ - సగటు స్థాయిలో ఉంది.
యాక్షన్ - ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేశారు కాబట్టి ఈ సినిమాలోని ఫైట్స్ బాగుండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కదా.
Gunturwala ప్రోస్పెక్టివ్: వెరైటీ సినిమా కావాలీ....వెరైటీ సినిమా కావాలీ...... అని గుండెలు బాదుకునే వాళ్ళ కోసమే తీసిన వెరైటీ సినిమా ఇది. మీకు గనక అలాంటి వెరైటీ సినిమా చూడాలనిపిస్తే ఈ సినిమా నిరభ్యంతరంగా చూడండి.

Tuesday, April 26, 2011

mr.perfect review [MR. పర్ఫెక్ట్ రివ్యూ ]

మిస్టర్ పెర్ఫెక్ట్

బ్యానర్ : .
Rating : 3.00/5
విడుదలయిన తేది : Apr 21, 2011

బ్యానర్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత - రాజు

కథ, దర్శకత్వం - దశరథ్

సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ - విజయ్.కె.చక్రవర్తి

మాటలు - అబ్బూరి రవి

పాటలు - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సత్యమూర్తి

ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్

ఆర్ట్ - రవీందర్

యాక్షన్ - పీటర్ హెయిన్స్

తారాగణం - కళాతపస్వి, డాక్టర్ కె.విశ్వనాథ్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి, ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, నాజర్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, బెనర్జీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణుడు, గౌతం రాజు, సమీర్, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, తులసి, ప్రగతి, ఉష తదితరులు...

కథ -

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీ(ప్రభాస్) ఆస్ట్రేలియాలో ఉండే భారతీయ కుర్రాడు. తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఫిలాసఫీ. తన ఇష్టాన్ని ఇతరుల కోసం త్యాగం చేయటం, వేరే వాళ్ళకి నచ్చినట్లు బ్రతకటం అతనికి నచ్చని పని. ఆ ఆలోచన కరెక్ట్ కాదని అతని తండ్రి అతనికి ఎంత నచ్చచెప్పాలని చూసినా అతనికి అర్థం కాదు. అతనికి ఇండియాలో ఉండే ప్రియ (కాజల్) అనే తన స్నేహితుడి కూతురితో వివాహం చేయాలని విక్కీ తండ్రి విక్కీని ఇండియాకి పిలుస్తాడు. ముందు విక్కీ తనకు నచ్చకపోయినా తర్వాత విక్కీని ప్రేమిస్తుంది ప్రియ. ఇండియాకి వచ్చాక విక్కీ కోసం ప్రియ తన ఇష్టా ఇష్టాలను మార్చుకోవటం చూసిన విక్కీకి అది నచ్చదు. తనలాగే ఆలోచించే అమ్మాయినే తాను పెళ్ళిచేసుకుంటానని చెప్పి ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోతాడు. అందుకు ఎవరు బాధపడినా విక్కీ పట్టించుకోడు.

ఆస్ట్రేలియాలో క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ పెట్టిన పోటీలో ఆరున్నర లక్షల మందిలో తనలాగే ఆలోచించే అమ్మాయి (తాప్సి) కూడా ఉందని తెలుసుకుని ఆమెను కలుస్తాడు. కానీ ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) "మీరిద్దరూ కలసి బ్రతకలేరు. మా పెద్దమ్మాయి పెళ్ళికి నువ్వురా. ఆ పెళ్ళికి వచ్చిన నలుగురిలో ఏ ఇద్దరు నువ్వు నచ్చావని చెప్పినా మీ ఇద్దరి పెళ్ళి చేస్తా"నని అంటాడు. ఆ పెళ్ళికి పెళ్ళి కొడుకు తరపున ప్రియ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక విధంగా చెప్పాలంటే దిల్ రాజు తను తీసిన "బొమ్మరిల్లు", "బృందావనం" రెండు సినిమాలను కలిపి ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్"గా తీశాడని చెప్పవచ్చు. ఒక విధంగా దర్శకుడు దశరథ్ పై రెండు చిత్రాలకు తోడు తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "సంతోషం" చిత్రం ఫ్లేవర్ ని కూడా కలిపాడు. ఆ విధంగా ఈ చిత్రాన్ని యూత్ కీ, ఫ్యామిలీ ఆడియన్స్ కీ నచ్చే విధంగా ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని తీశాడు. చాలా రోజులుగా హిట్ లేని కసిని ఈ చిత్రం తీయటంలో చూపించాడు దశరథ్. ఆ విధంగా ఒక హిట్ చిత్రాన్ని సొంతం చేసుకున్నాడు దశరథ్.

నటన - ప్రభాస్ తన నటనకు ఈ చిత్రంలో మరింత పదును పెట్టాడు. డైలాగ్ మాడ్యులేషన్ లో పరిణితి కనపడింది. హావభావాలు ప్రకటించటంలో కూడా అతనిలో మెరుగుదనం కనపడింది. మానసికంగా విక్కీ పాత్ర పడే యాతన, ఆ ఘర్షణ ప్రభాస్ చాలా బాగా చూపించాడు. ఇక యాక్షన్ సీన్లలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదుగా. మొత్తంగా ప్రభాస్ ఒక మంచి నటుడిగా రూపాంతరం చెందుతున్నాడు. కాజల్, తాప్సిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం కామెడీ కాస్త పండింది. మిగిలిన చాలా మంది నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో "చలి చలి" పాట ట్యూన్ ని సిగ్నేచర్ ట్యూన్ గా అవసరమైనప్పుడల్లా సినిమాలో వాడటం బాగుంది. అలాగే "రాయుడు గారబ్బాయి", "ఆకాశం బద్దలైన", "బావా ఎప్పుడువచ్చితివి" పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. రీ-రికార్డింగా చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాకి మంచి ప్లస్ కెమెరా వర్క్. స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసిన ఫైట్ లో కేమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే పాటల్లో కానీ, సినిమా అంతా కానీ, చాలా నీట్ గా చూపించటంలో కెమెరా వర్క్ బాగుంది.

మాటలు - ఈ సినిమాకి హైలైట్ అబ్బూరి రవి మాటలు. ఈ సినిమాలోని మాటలు సింపుల్ గా ఉండి, అర్థవంతంగా మనల్నిఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అలాగే "బొమ్మరిల్లు" చిత్రంలోలా కొన్ని సందర్భాల్లో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి ఈ చిత్రంలోని సంభాషణలు. హేట్సాఫ్ టు హిమ్.

పాటలు - ఈ చిత్రంలోని పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. కాకపోతే తెలుగు పాటల్లో ఆంగ్ల పదాల ప్రయోగమే ఆధునికత (స్టైల్) అనుకునే దౌర్భాగ్యం నుంచి మన పాటల రచయితలు ఎన్నటికి బయటపడతారో పాపం.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - చాలా బాగుంది. రవీందర్ తో చాలా పెద్ద తలకాయనొప్పి ఎంటంటే సినిమాలో ఏది సెట్టో ఏది ఒరిజనలో అతను మనకి చెపితే కానీ అర్థం కాదు.
కొరియోగ్రఫీ - ఉన్నంతలో అన్ని పాటల్లోనూ బాగుందనే చెప్పాలి.
యాక్షన్ - ఈ సినిమాలో ఉన్న మూడు ఫైట్లూ బాగున్నాయి.


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఇది ఆహో ఓహో అనేంత గొప్ప సినిమా కాకపోయినా, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని కచ్చితంగా చెప్పాలి. అదీగాక ఈ సినిమాలో అశ్లీలత, అసభ్యతలకు తావులేకుండా తీస్తూ, మానవ సంబంధాలకు పెద్దపీట వేయటం వలన సకుటుంబంగా ఈ సినిమాని చూడవచ్చు.

Thursday, April 14, 2011

teen maar review[తీన్ మార్ రివ్యూ]


బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్స్
Rating : 3.00/5
విడుదలయిన తేది : Apr 14, 2011



నిర్మాత - గణేష్ స్క్రీన్ ప్లే,

దర్శకత్వం - జయమత్ .సి.పరాన్జీ

కథ - ఇంతియాజ్ ఆలీ

సంగీతం - మణిశర్మ

సినిమాతోగ్రఫీ - జయనన్ విన్సెంట్

మాటలు - త్రివిక్రమ్ శ్రీనివాస్

పాటలు - రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, రెహమాన్

ఎడిటింగ్ - యమ్.ఆర్.వర్మ

ఆర్ట్ - నారాయణ రెడ్డి

కొరియోగ్రఫీ - రాజు సుందరం, కళ్యాణి

యాక్షన్ - టినూ వర్మ

తారాగణం - పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బందా, పరేష్ రావెల్, సోనూ సూద్, ముఖేష్ రుషి, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, మేల్కోటే, ప్రగతి, భార్గవి తదితరులు...

కథ

హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" సినిమాకిది మక్కీకి మక్కీ కాపీ. మీరు గనక ఆ సినిమా చూసుంటే ఈ సినిమా చూడాల్సిన పనిలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇక కథ విషయానికొస్తే ముప్పై యేళ్ళ క్రితం అర్జున్ పాల్వాయ్ ( పవన్ కళ్యాణ్) వసుమతి ( కృతి కర్బందా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ఆమె కుటుంబంతో గొడవ పడతాడు. చివరికి తన ప్రేమను సఫలీకృతం చేసుకుంటాడు. ప్రస్తుతానికొస్తే యు.యస్.లో ఉండే మైకేల్ వేలాధన్ ( పవన్ కళ్యాణ్) జీవితాన్ని జాలీగా తీసుకునే మనిషి. అతను అమ్మాయిల వెంట తిరుగుతూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు.

అతనికి ప్రేమ వంటికి పడదు. యమ్ బి ఎ చదివి ఒక హోటల్లో షెఫ్ గా పనిచేస్తుంటాడు. అలాంటి వేలాయుధన్ కి మీరా (త్రిష) అనే అమ్మాయి తారసపడుతుంది. అదే సమయంలో సేనాపతి (పరేష్ రావెల్) తన స్నేహితుడు అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథని వేలాయుధన్ తో చెపుతూంటాడు. అతనికే ఎందుకు చెపుతాడంటే వేలాయుధన్ అచ్చం అర్జున్ పాల్వాయ్ లా ఉంటాడు గనుక. అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథ వింటూంటే మీరాతో పరిచయం వేలాయుధన్ లో కనపడని మార్పు తెస్తుంది. ఎందుకంటే అర్జున్ పాల్వాయ్ లోనూ, మైకేల్ వేలాయుధన్ లోనూ కొన్ని కామన్ లక్షణాలుంటాయి. మీరా, వేలాయుధన్ స్నేహితులుగా విడిపోగానే మీరా ఇండియా వెళ్ళిపోతుంది. యు.యస్.లో మైకేల్ కి మిచెల్ అనే రష్యన్ అమ్మాయి పరిచయమవుతుంది. మిచెల్ సాంగత్యంలో ఉన్నా మైకేల్ మీరాను మరచిపోలేక ఇండియాకి వెళతాడు.

అక్కడ మీరాకి సుధీర్ ( సోనూ సూద్ ) అనే యువ రాజకీయ నాయకుడితో సంబంధం నిశ్చయమై పెళ్ళవుతుంది. అక్కడి నుండి మైకేల్ లో మీరాని తను ప్రేమిస్తున్నానని తెలుస్తుంటుంది. ఇక్కడ మీరా పెళ్ళి సుధీర్ తో కాగానే, మైకేల్ కి అమెరికాలో తను కోరుకున్న కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. మైకేల్ ని మరచిపోలేని మీరా సుధీర్ తో చెప్పి విడిపోతుంది. ఆ తర్వాత ఏమయింది....? మిచెల్ ని మైకేల్ ఏం చేశాడు...? మైకేల్ ని మీరా కలిసిందా...? మైకేల్ చివరికి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

చాలా జాగ్రత్తగా హిందీ సినిమాని చిన్న చిన్న మార్పులతో అలాగే తీశారు. దర్శకుడు జయంత్ ఈ సినిమా కోసం కొత్తగా చేసిందేం లేదు. హింది సినిమాని ఫాలో అవటమే జయంత్ చేసింది. ఇక అర్జున్ పాల్వాయ్ గా, మైకేల్ వేలాయుధన్ గా పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ రెండు పాత్రల్లోనూ వీలయినంత వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ చూపించారనే చెప్పాలి. ఒక క్రమబద్ధమైన నీతివంతమైన జీవితాన్ని అర్జున్ పాల్వాయ్ గడిపితే, ఏ నీతీ లేకుండా జీవితాన్ని ఆస్వాదించటమే లక్ష్యంగా బ్రతికే నేటి కొంతమంది యువకులకు ప్రతినిధిగా మైకేల్ వేలాయుధన్ పాత్ర ఉంటుంది.

మళ్ళీ పాత చిత్రాల్లో అంటే "ఖుషి", "బద్రి" వంటి చిత్రాల్లోలా ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ నటనలో ఎనర్జీ, ఉత్సాహం కనబడటం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. ఇక హీరోయిన్ త్రిష ముఖంలో ముడతలు స్పష్టంగా కనపడుతున్నాయి. త్రిష ముఖంలో కళ తప్పింది. కానీ ఆమె నటనలో మాత్రం పరిణితి కనిపించింది. కృతి కర్బందా మేకప్ కాస్త తగ్గిస్తే బాగుండేదనిపించింది. ఆమె నటన కూడా ఫరవాలేదు. ఇక పరేష్ రామెల్, సోనూ సూద్, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, ముఖేష్ రుషి, మేల్కోటే వంటి నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - గొప్పగా లేకపోయినా కొన్ని పాటలు వినటానికి బాగున్నాయి.

రీ-రికార్డింగ్ బాగుంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది. కొన్ని ఫ్రేములు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. పాటల్లో, యాక్షన్ సీన్లలో కేమెరా వర్క్ బాగుంది.

మాటలు - చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రాండ్ ఈ చిత్రంలో స్పష్టంగా కనపడుతుంది. మాటల్లో ట్రికిష్ లాజిక్ మనల్ని బాగా ఆలోచింపజేస్తూ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో డైలాగుల్లో. పాటలు - సాహిత్య పరంగా అన్ని పాటలూ బాగున్నాయనే చెప్పాలి. కాశీలో శివుడి పాట, "ఆలె ఆలె ఆలె ఆలె" పాట సాహిత్య పరంగా ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంటాయి.

ఎడిటింగ్ - యమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది.

ఆర్ట్ - ఈ చిత్రంలో ఆర్ట్ పనితనం చాలా బాగుంది. ముప్పయ్యేళ్ళ క్రితం భారత దేశానికి, ఇప్పటి భారత దేశానికి ఉన్న తేడాని ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి చాలా చక్కగా చూపించారు.

కొరియోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా "ఆలె ఆలె ఆలె ఆలె" పాటలో కొరియోగ్రఫీ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉండి బాగుంది.

యాక్షన్ - ఈ సినిమాలో మామూలుగా హీరో తంతే విలన్లు వందగజాల దూరం గాల్లోకి ఎగిరిపోవటం వంటివి లేకుండా టిను వర్మ యాక్షన్ కంపోజింగ్ సహజంగా ఉండి ఆకట్టుకునే ఉంది.


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఈ సినిమా నానాటికీ నేటి యువతరంలో తరిగిపోతున్న మానవ విలువల గురించి, జీవితం గురించి నేటి యువత ఆలోచనా విధానాన్ని చక్కగా కళ్ళముందుంచుతుంది. హిందీ సినిమా "లవ్ ఆజ్ కల్ " సినిమా కనక మీరు చూడకపోతే, పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ నటన కోసం ఈ సినిమా హ్యాపీగా చూడండి.