
నచ్చావులే తరువాత టపటపా సినిమాలు తీసిన తనీష్ పరాజయాలు ఎదురవటంతో కాస్త నెమ్మదించాడు. ఇప్పుడు తాజాగా మంచివాడు సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఫై లక్ష్మి నారాయణ(దీప్తి) దర్శకత్వంలో పరాస్ జైన్, యన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తనీష్ సరసన భామ హీరోయిన్ గా పరిచయం అయ్యిన ఈ సినిమాలో కె.విశ్వనాధ్, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శిల్పి సంగీతాన్ని అందించారు. ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ గా వెలుగొందిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రస్తుతం విజయాల వేటలో కాస్త వెనుక బడి ఉంది. తమ సంస్థ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే విజయవంతమైన చిత్రం కోసం ప్రయత్నాలను ముమ్మరంచేసింది సూపర్ గుడ్ ఫిల్మ్స్. ఆ క్రమంలో ఈవారం విడుదలైన 'మంచివాడు' ఎంత వరుకు ఆ సంస్థ పరువును నిలబెట్టిందో మన సమీక్షలో చూద్దాం.
కధ:
రాజా(తనీష్) ఓ రిటైరేడ్ ఐ.ఏ.యస్ ఆఫీసర్(కె.విశ్వనాధ్) మనవడు. చదువుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడని ఆయనకు రాజా అంటే కోపం. రాజా మరదలు ఇందు(భామ) అమెరికా నుండి వస్తుంది. ఆమె బాగా చదువుకుని అణుకువగా ఉన్న పిల్ల. మొదటి చూపులోనే అమ్మాయి ఫై మనసు పారేసుకుంటాడు రాజా. సరిగ్గా అప్పుడే రాజాకి సోదరుడి వరసైన రమేష్ (శివ) ఎంటర్ అవుతాడు. అతను బాగా చదువుకున్నవాడు ఇందు కు సరైన జోడి కూడా అని భాద పడిపోతాడు రాజా. అప్పుడు రాజా ఫ్రెండ్ (రఘుబాబు) అతని భాదను అర్ధంచేసుకుని రాజా ను ఒక అమ్మాయి మోసం చేసిందని కధ అల్లి ఇందు కు చెబుతాడు. దాంతో ఇందుకు రాజా ఫై సానుభూతి కలుగుతుంది. ఆ తరవాత ఒక రోజు కల్పించి చెప్పిన కధలోని రాజా ను మోసం చేసిన అమ్మాయి డైరెక్ట్ గా వస్తుంది. అసలు ఎంతకీ ఆ అమ్మాయి ఎవరు..? అమ్మాయిని వదిలించుకుని రాజా ఇందు ప్రేమను దక్కించు కున్నడా..లేదా..? అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
పాత చింతకాయ పచ్చడి లాంటి కధతో సినిమాను రూపొందించాడు దర్శకుడు దీప్తి. ఈ సినిమా మొదటి సగంలో రొటీన్ తరహ కామెడీ తప్పించి చెప్పుకోతగ్గ విషయంలేదు. విశ్రాంతి సమయానికి కాస్తంత కదలిక వచ్చినా రెండో సగం మొదలైన తరవాత మళ్ళి పాత ట్రాక్ లో కి నడిచి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. దానికి తోడు సినిమా యాంటి క్లైమ్యాక్స్ తో ముగుస్తుంది. గంగోత్రి విశ్వనాధ్ రాసిన మాటలు టి.వి సీరియల్ ను తలపిస్తాయి. శిల్పి పాటలు యస్.ఏ రాజకుమార్ బాణిని తలపిస్తూ సాధారణంగా ఉన్నాయి. వేణు గోపాలన్ సినిమాటోగ్రఫీ లో నాణ్యత లోపించింది. ఎడిటింగ్ లో జంప్ లు, కట్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మాణాత్మక విలువలు సాదా సీదాగా ఉన్నాయి. తనీష్ ఈజ్ తో, ఎనర్జీ తో చక్కగా నటించాడు. కాకపోతే కామెడీ టైమింగ్ విషయంలో మరికాస్త పరిణితి సాదించవలసి ఉంది. కధానాయకిగా పరిచయం అయిన భామ భావోద్వేగాలు సరిగా ప్రదర్శించలేని మరో అందమైన హీరోయిన్. శివ పరవాలేదనిపిస్తాడు. కళాతపస్వి విశ్వనాధ్, చంద్ర మోహన్ బాగా నటించారు. రఘుబాబు కామెడీ కొన్ని వర్గాల ప్రేక్షకులకే పరిమితం అయ్యింది. మిగతా నటీనటులు పాత్రలకు అనుగుణంగా తమ పరిదిమేర నటించారు.
కొసమెరుపు :
గతంలో వచ్చిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ నాడిని ఇప్పటి టివి సీరియల్స్ వాళ్ళు పట్టేసారు, ఇప్పుడు వీళ్ళు మళ్ళి అదే ఫార్ములాతో వస్తే సినిమా సీరియల్లా అనిపిస్తుంది కానీ సినిమాల అనిపించదు కద... అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment