
తెలుగు వారి ఆస్థాన హాస్యనటుడు బ్రహ్మానందం కుమారుడిగా అప్పుడెప్పుడో 'పల్లకిలో పెళ్ళికూతురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ చాన్నాళ్ళ తరవాత మలి ప్రయత్నంగా తన నటనతో ప్రేక్షకులచేత 'వారెవా' అనిపించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ మిరాకిల్స్ పతాకంఫై నిర్మితమైన 'వారెవా' చిత్రంతో మహి దర్శక నిర్మాతగా పరిచయం అయ్యాడు. గౌతమ్ కు జోడిగా శాంభవి కధానాయికగా మరిచయమవగా బ్రహ్మానందం , షాయాజీ షిండే, వేణు మాధవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్ శంకర్ సంగీతానికి కేదారినాథ్ సాహిత్యాన్ని అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు. తోలి చిత్రం పరాజయం కావడంతో దాదాపు ఆరు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొడుకు కెరీర్ ను తీర్చి దిద్దే పనిలో బ్రహ్మానందం చాలా జాగ్రత్తలు తీసుకుని పక్కగా ప్లాన్ చేసి ఈ సినిమా చేపించాడు అని విడుదలకు ముందు వినిపించింది. మొదటి చిత్రం తరవాత ఇన్నేళ్ళలో దాదాపు గుర్తు కూడా లేని గౌతమ్ రీ ఎంట్రీలో ప్రేక్షకులకు ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడో ఈ సమీక్షలో చూద్దాం.
కధ: రిషి (గౌతమ్) వైజాగ్ లో సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ లో సీట్ రావటంతో అన్న వదినలతో ఉంటూ చదువుకోటానికి హైదరాబాద్ వస్తాడు. కాలేజీ లో జాయిన్ అయ్యిన తరవాత సంధ్య (శాంభవి) పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమ అవుతుంది. సంధ్య తండ్రి పెద్ద బిజినెస్ మాన్, ఆయన రిషి మంచితనానికి ముచ్చటపడి వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాడు. దాంతో రిషి వాళ్ళ అమ్మను ఒప్పించటానికి సంధ్యను తీసుకుని వైజాగ్ వస్తాడు. అక్కడ ఓ రోజు వైజాగ్ కే పెద్ద రౌడీ అయిన భూపతి (ఆశిష్ విద్యార్ది)మనుషులు రిషిని చంపటానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం భూపతి బావ మరిదిని పొరపాటున రిషి చంపేస్తాడు . ఆ పగతో రిషిని చంపాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి రిషి భూపతి దగ్గరకు వెళ్ళి బ్రతిమాలుకుంటే నెలరోజులు టైం ఇస్తున్నా ఎక్కడైనా దాక్కో వెతికి పట్టుకు నిన్ను చంపేస్తా, నెల రోజుల్లో నిన్ను చంపలేక పొతే నిన్ను వదిలేస్తా అంటాడు. దానికి రిషి నెల ఎందుకు ఒక వారం నేను నీకు అందుబాటులోనే ఉంటా నన్నుచంపు లేదంటే వదిలేయ్ అని ఎదురు చాలెంజ్ చేస్తాడు. ఇక అక్కడి నుండి రిషి ఏ విదంగా ఆ వారం రోజులు భూపతికి దొరక్కుండా తప్పించుకుని బ్రతికి బయటపడ్డాడు అన్నది మిగతాకధ.
విశ్లేషణ: ఈ సినిమా చూసిన తరవాత ఎవరిని ఎందుకు వారెవా.. అనాలో అర్ధం కాదు. ఎవరెట్లా వున్నా తొలుత నిందించవలసినది తొలిసారి నిర్మాణ, దర్శక బాద్యతలు నిర్వహించిన మహిని. ఎందుకంటే తనకు సాద్యమైనంత వరకు క్వింటాళ్ళ లెక్కన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. కధ పరవాలేదనిపించినా చిక్కురొక్కురు కధనం తో సినిమాని కంగాళీ చేసాడు. తోలిసగం మొత్తం రొటీన్ సన్నివేశాలతో అర్ధం పర్ధం లేకుండా గడిచి పోతుంది. రెండో సగం మద్యలో అసలు కధ మొదలవుతుంది అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోవటంతో చూడటానికి ఏమి లేకుండా పోయింది. దర్శకుడిగా మహి ఏ విభాగాన్నీ సమర్ధవంతంగా వినియోగించుకోలేక పోయాడు. సినిమాలో ఏ పాత్రని అర్ధవంతంగా తిర్చిదిద్దలేకపోయాడు. పాటలు కూడా అంతంతమాత్రం గానే ఉన్నాయి. చివరికి బ్యాక్ స్కోరు ను కూడా సరిగా పలికించలేక పోయాడు మహేష్ శంకర్. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పరవాలేదనిపించిన, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ తన స్థాయికి తగ్గట్టు లేదు. రామ్ లక్ష్మణ్ పోరాటాలు బాగానే ఉన్నాయి.హీరో గా గౌతమ్ ఆకట్టుకోలేక పోయాడు. నటనలో, డైలాగులు చెప్పటంలో ఇంక పరిణితి సాదించవలసి ఉంది. కేవలం ఫైట్స్, డాన్సులు మాత్రమే నటన కాదు అని గమనించాలి. స్టార్ కమెడియన్ కొడుకు అయ్యి ఉండి కూడా, భావోద్వేగాలను పలికించటంలో, కనీసం కామెడీ టైమింగ్ విషయం లో అన్నా పట్టు ప్రదర్శించకపోవడం విచారకరం. కొత్త అమ్మాయి శాంభవి మరో నటన రాని ముంబాయి దిగుమతి, అందం చూసి ఆనందించే వారికీ బాగానే ఉంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండి పాటలకే పరిమితమైంది. షాయాజీ షిండే, దేవన్, ఆశిష్ విద్యార్ధి తమ పాత్రలకు అనుగుణంగా బాగానే నటించారు. రఘు బాబు, బ్రహ్మానందం, వేణుమాధవ్ ల కామెడీ రొటీన్ గా ఉండి అంతగా నవ్వించదు.
No comments:
Post a Comment