
సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ తన బహుముఖ ప్రజ్ఞను చూపిస్తూ నటుడిగా శ్రీను వాసంతి లక్ష్మి, దర్శకుడిగా అందమైన మనసులో సినిమాను రూపొందించాడు. ఇప్పుడు తను స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'బ్రోకర్' సినిమా ఈ సంవత్సరపు ఆఖరి చిత్రంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్స్ సినిమా పతాకం పై రమేష్ మద్దినేని నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ కధ, స్క్రీన్-ప్లే తో పాటు సంగీతాన్ని కూడా అందించారు. ఎమ్.వి.ఎస్. హరనాద్ మాటలను వ్రాయగా కోట శ్రీనివాసరావు, శ్రీహరి, గొల్లపూడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడిగా సక్సెస్ అయిన పట్నాయక్ నటుడిగా దర్శకుడిగా నిరూపించుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలుచేస్తూనే వున్నాడు. ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా సంచలనం సృస్థించిన 2జి స్పెక్ట్రం అనుమతులకు కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియ కారణం అని తెలుసుకుని ఆచ్చర్యపడ్డారు దేశప్రజలు. ఆ లాబియిస్ట్ లు చేసే బ్రోకరింగ్ స్వరూపస్వభావాలు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేసిన ఆర్.పి. పట్నాయక్ 'బ్రోకర్' సినిమా ఎంతవరకు సమాజానికి ఉపయోగపడే విధంగా వుందో ఈ సమీక్షలో చూద్దాం.
కధ: గణపతి (ఆర్.పి.పట్నాయక్) ఓ పెద్ద లాబియిస్ట్ అదే జనాలు ముద్దుగా 'బ్రోకర్' అని పిలుస్తారులే . రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను తన గుప్పెట్లో ఉంచుకుని గవర్నమెంట్ పనులు చేయిస్తూ ఉంటాడు. కాంట్రాక్ట్ లు ఇప్పించడం దగ్గర నుండి కేసులు మాఫీ చేయించడం, ఆఫీసర్ లను బదిలీ చేయడం వరకు తను చేయించలేని పని అంటూవుండదు. అదే విధంగా తాను ఇప్పించిన ఓ కాంట్రాక్టర్ కట్టిన ఫ్లైఓవర్ కూలి తన కొడుకు చనిపోయినా కూడా బ్రోకరింగ్ ని వదలకుండా మోసాలు చేస్తూనే ఉంటాడు. ఆ క్రమంలోనే అతని భార్య అతనికి దూరం అవుతుంది. ఓ అవినీతి ఆఫీసర్ అయిన ధర్మతేజ (శ్రీహరి) తన తప్పు తెలుసుకుని మంచివాడిగా మారి గణపతికి ఆదర్శంగా నిలుస్తాడు. ఒక విధంగా మారటానికి అవకాశం కల్పించుకున్న గణపతి తను చేస్తూ, చేయిస్తున్న అవినీతి వల్ల ఎంత నష్టం జరుగుతుందో గ్రహిస్తాడు. దాంతో తాను ఒక్కడు మాత్రమె మారితే సరిపోదు మిగతా వాళ్ళు మారాలి అని టివి9 సహకారంతో మార్పుకు శ్రీకారం చుడతాడు. ఆ కార్యక్రమం తో గణపతి ఏ విధంగా విజయం సాధించాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ: అవసరానికి, అవకాశానికి మధ్య బ్రోకర్ అనే కాప్షన్ తోనే సినిమా కధను చెప్పేశాడు ఆర్.పి. . బ్రోకరింగ్ ఎలా ఉంటుంది దాని పరిమాణాలు ఎలా ఉంటాయి అనే అంశం మీద చర్చించే ప్రయత్నం చేసాడు. అవినీతిని అంతం చేయడానికి చట్టాలు, శాశనాలు కాదు చైతన్యంతో కూడిన మార్పు కావాలి అని, అలాగే మార్పు అనే విప్లవాన్ని సృష్టించడానికి కావలసింది ఓ చిన్న అవకాశం అనీ అంతర్లినంగా చెప్పాడు. సమాజంలో పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని వదిలించటానికి ఓ పాజిటివ్ ఆలోచన చాలు అని మంచి ఆలోచన చేసిన ఆర్.పి. అభినందనియ్యుడు. కాకపోతే మెస్సేజ్ అంతా చివరి అరగంటలో మాత్రమే చెప్పాలనుకోవడంతో మొదటి సగంలో విషయం లేక తేలిపోయింది. క్లైమాక్స్ వరకు కధనం నెమ్మదిగా సాగుతూ దూరదర్శన్ లో వచ్చే డాక్యుమెంటరిని తలిపించింది. స్క్రీన్ ప్లే కు కాస్తా నవ్యతను జోడించి సినిమాటిక్ అంశాలతో వినోదానన్ని కూర్చి నట్టయితే సినిమా అద్భుతంగా ఉండేది. ఆర్. పి. నటుడిగా, దర్శకుడిగా కంటే కధకుదిగానే ఆకట్టుకున్నాడు. యమ్.వి.ఎస్.హరనాథ్ రావు మాటల్లో వాడి తగ్గినా పతాక సన్నివేశాల్లో పర్వాలేదనిపించాయి. సమాజంలోని అవినీతి తట్టుకోలేక దానినీ ఎదిరించలేక నిస్సహయుడిగా ప్రాణాలు కోల్పోయే స్కూల్ మాస్టారు పాత్రలో గొల్లపూడి బాగా నటించారు. కోట శ్రీనివాసరావు, శ్రీహరి తమ సహజ నటనతో సినిమాకు కాస్తా ఊరటనిచ్చారు. మయూరి పర్వాలేదనిపించిన దర్మవరం చేసిన నవ్వించే ప్రయత్నం ఆకట్టుకోలేదు. ఆర్.పి.పాటల్లో రెండు మాత్రమే గుర్తుండిపోతాయి. చైతన్యప్రసాద్ వ్రాసిన సాహిత్యం కూడా రెండు మూడు పాటల్లో నే బాగుంది. మిగితా పాత్రల్లో నటించిన నటి నటులు తమ పరిది మేర బాగానే చేసారు. రక్త చరిత్ర తరవాత రెడ్ కెమెరా తో చిత్రీకరించి పూర్తీ స్థాయి డిజిటల్ టెక్నాలజీ తో రూపొందించిన చిత్రంగా మంచి మార్కులే వేయించుకుంది బ్రోకర్ . కొసమెరుపు: ఆర్.పి.బ్రోకర్ ఓ మంచి ప్రయత్నమే కాని మంచి సినిమా కాదు అని టాక్ వినపడుతుంది. క్లైమక్స్ మాత్రమే బాగుండటంతో చివరివరకు ప్రేక్షకులను హాలులో కూర్చోబెట్టటమే పెద్ద సవాల్ ఈ సినిమా విజయానికి.
No comments:
Post a Comment